ఐపీఎల్లో అయ్యర్ రేర్ రికార్డ్.. కెప్టెన్‌గా 100వ మ్యాచ్..!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తన ఐపీఎల్ కెరీర్లో ఒక సరికొత్త మైలురాయిని అధిగమించబోతున్నాడు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో ఆడిన కీలక మ్యాచ్‌లో అతను కెప్టెన్‌గా తన 100వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు. లీగ్ చరిత్రలో కెప్టెన్‌గా ఈ అరుదైన రికార్డు క్లబ్లో చేరబోతున్న ఐదో భారతీయ ఆటగాడిగా అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు విజయవంతంగా సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్.. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆడిన 99 మ్యాచ్‌లలో 54 విజయాలు, 40 ఓటములను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ మైలురాయిని అందుకోబోతున్న తరుణంలో, ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్-5 భారతీయ ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని(MS Dhoni) అత్యధికంగా 235 మ్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని సారథ్యంలో సిఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. ధోని తర్వాత ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ(Rohit sharma) 158 మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2011 నుండి 2023 వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) 143 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.
అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్లను 129 మ్యాచ్‌లలో నడిపించిన గౌతమ్ గంభీర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు నేటి ఆర్సీబీ మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ తన వందో మ్యాచ్ పూర్తి చేసుకుని వీరి సరసన చేరబోతున్నాడు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







