బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ.. జగన్ సంచలన కామెంట్స్..!
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై, రాజధాని అమరావతి(Amaravati) ప్రాజెక్టుపై వైఎస్సార్(YSRCP) కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పూర్తిగా పక్కనబెట్టి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ రాష్ట్రాన్ని ఒక ‘జంగిల్ రాజ్’గా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు పలానా మంచి చేశానని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏ కోశానా లేదని, ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అత్యంత ఘోరంగా ఉందని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి “బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ” అన్న నానుడిని చంద్రబాబు ప్రతిరోజూ తన వైఫల్యాలతో రుజువు చేస్తున్నాడని, ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో గ్యాంగ్‌తో కలిసి వైసీపీని ఒక భూతంలా చూపే కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, అమరావతికి ప్రత్యామ్నాయంగా తాము అత్యంత ప్రాక్టికల్‌గా ఉండే ‘మావిగన్’ (Mavigan – Machilipatnam, Vijayawada, Guntur) ప్రాంతాన్ని రాజధాని కారిడార్‌గా ప్రతిపాదించామని వైఎస్ జగన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
అమరావతి లాంటి ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టాలంటే శూన్యం నుంచి మొదలుపెట్టాలని, కానీ మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే 35 నుండి 40 లక్షల మంది జనాభా ఉండటమే కాకుండా అపారమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇక్కడ ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 3 ప్రధాన రైల్వేస్టేషన్లు, 4 నేషనల్ హైవేలు మరియు 9 ప్రభుత్వ, ప్రైవేటుల మెడికల్ కాలేజీలు, యూనివర్శిటీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ ‘మావిగన్’ ప్రతిపాదనకు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని, దీనిపై సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని, అందుకే మంత్రులతో బూతులు తిట్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎప్పటికీ శాశ్వత రాజధాని అనేది లేకుండా చేస్తున్నాడని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు లాంటి ప్రాథమిక వసతులు కల్పించడానికే చంద్రబాబు సొంత లెక్కల ప్రకారమే అక్షరాల రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని, ఇదంతా కేవలం స్కాముల కోసమేనని మండిపడ్డారు.
అమరావతి అనేది ఒక ‘సెల్ఫ్‌ఫైనాన్స్ ప్రాజెక్ట్’ అని చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలని, ఇప్పటికే అమరావతి కోసం తెచ్చిన, కమిట్ అయిన అప్పులే రూ.47,387 కోట్లకు చేరాయని, వీటికి తోడు రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నారని లెక్కలు బయటపెట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ భవనాలను చంద్రబాబు పక్కనబెట్టేసి, మళ్లీ వాటి పేరిట కొత్తగా బిల్డింగులు కడుతూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి







