ఎవరీ గుర్నూర్ బ్రార్..? ఫుట్ బాల్ నుంచి పేసర్ వరకు..!
అఫ్గానిస్తాన్‌తో జూన్ 6 నుండి ప్రారంభం కానున్న వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం బీసీసీఐ (BCCI) ప్రకటించిన భారత జట్టులో గుర్నూర్ బ్రార్ అనే సరికొత్త పేరు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇవ్వడంతో, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పంజాబ్‌కు చెందిన ఈ యువ పేసర్‌కు జట్టులో తొలిసారిగా అవకాశం కల్పించింది. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండే గుర్నూర్ బ్రార్, తన అద్భుతమైన వేగం, బౌన్స్‌లతో దేశవాళీ క్రికెట్లో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి ఈ మేడెన్ కాల్-అప్ను అందుకున్నాడు.
పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ ప్రతిభను టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) చాలా ముందే గుర్తించాడు. వీరిద్దరూ అండర్-19 రోజుల నుండి కలిసి క్రికెట్ ఆడారు. గిల్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే గుర్నూర్ మొహాలీ జిల్లా జట్టులోకి, ఆ తర్వాత పంజాబ్ అండర్-23 జట్టులోకి ఎంపికయ్యాడు. 2022లో ఫస్ట్-క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బ్రార్, 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో కేవలం 12 మ్యాచుల్లోనే 33 వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ (IPL) విషయానికి వస్తే, గుర్నూర్ బ్రార్ 2019లో ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2023లో పంజాబ్ కింగ్స్(PBKS) తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా, గత ఐపీఎల్ 2025 వేలంలో గుజరాత్ టైటాన్స్ (GT) ఫ్రాంచైజీ ఈ యువ బౌలర్‌ను రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ వేదికపై అఫ్గానిస్తాన్ బ్యాటర్లను ఎదుర్కొనేందుకు ఈ పొడవైన పంజాబ్ స్పీడ్‌స్టర్ ఎంతవరకు ఉపయోగపడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి







