వైభవ్ సూర్యవంశి నయా రికార్డ్..!
రాజస్థాన్ రాయల్స్ (RR) సంచలనం, 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్లో తన రికార్డుల వేటను కొనసాగిస్తూ సంచలన బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం రాత్రి జైపూర్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG)తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగులు చేసి రాజస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఈ టీనేజ్ సెన్సేషన్ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా పలు అరుదైన రికార్డ్ లను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌తో ఒక ఐపీఎల్ సీజన్లో అత్యంత పిన్న వయస్సులోనే 500 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో 2018లో ఢిల్లీ తరఫున 20 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన రిషభ్ పంత్(Rishab pant) రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేస్తూ అత్యధికంగా 236.3 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ (2019లో 204.8), అభిషేక్ శర్మ (2026లో 202.0) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
పవర్‌ప్లే బాదుడులోనూ వైభవ్ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఒకే ఐపీఎల్ ఎడిషన్‌లో 50 సిక్సర్లు బాదిన మొదటి భారతీయ బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ ఖాతాలో ప్రస్తుతం 53 సిక్సర్లు ఉన్నాయి. అలాగే ఒకే సీజన్లో రెండుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఫిన్ అలెన్ సరసన చేరాడు. వైభవ్ విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ పవర్‌ప్లేలోనే ఏకంగా 60 సిక్సర్లు బాది పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ అద్భుత విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి







