ఏపీ మంత్రికి సొంత నియోజకవర్గంలో సెగ..!
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ లక్ష్యంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ విమర్శకులను, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారంటూ మంత్రి సత్యకుమార్పై సొంత పార్టీ కూటమి నేతలతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “సత్యకుమార్.. నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లోకి రా” అంటూ ధర్మవరం(Dharmavaram) స్థానిక నాయకులు సవాల్ విసరడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ తాజా రాజకీయ వివాదానికి ప్రధాన కారణం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఒక దాడి ఘటన. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన హైకోర్టు(High court) న్యాయవాది కె. అంజన్ రెడ్డిపై మంత్రి వ్యక్తిగత సహాయకుడు (PA) హరీష్, అనుచరులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అంజన్ రెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ప్రశ్నించే వారిపై ఇలా దౌర్జన్యాలు చేయడం దుర్మార్గమని స్థానిక నేతలు మండిపడుతున్నారు.
ఈ ఘటనకు నిరసనగా ధర్మవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు ఏకమై భారీ ధర్నా చేపట్టారు. నిరసనలో పాల్గొన్న బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నేత పరమేష్ మాట్లాడుతూ.. సత్యకుమార్ ఒక బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, అనంతపురంలో కలకలం రేపిన ‘హనీ ట్రాప్’ (Honey Trap) స్కామ్ వెనుక ఆయన హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి అండతోనే ధర్మవరంలో రౌడీయిజం పెరుగుతోందని, బాధితుడికి న్యాయం జరిగే వరకు మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు.







