రోహిత్, హార్దిక్‌లకు విశ్రాంతి..? పంత్ వైస్ కెప్టెన్సీపై వేటు..?
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే కీలక సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలెక్షన్ కమిటీ నేడు గువాహటిలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతోంది. వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు, జట్టులో సీనియర్ల మార్పుల నేపథ్యంలో ఈ సమావేశంలో సెలెక్టర్లు తీసుకోబోయే నిర్ణయాలపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ(Rohith sharma) ఫిట్నెస్ ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
ఇటీవల ఐపిఎల్ లో (IPL) సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. దీనికి తోడు అతని ఫిట్నెస్ సమస్యలు కూడా వేధిస్తుండటంతో, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలా లేదా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh pant) టెస్ట్ వైస్ కెప్టెన్సీ పదవిపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. పంత్‌పై డిప్యూటీ కెప్టెన్సీ భారాన్ని తగ్గించి, అతను కేవలం తన వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్‌పైనే పూర్తి శ్రద్ధ పెట్టేలా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇందులో భాగంగానే అతనిని వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రాబోయే విదేశీ టూర్ల దృష్ట్యా వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సిరీస్‌కు పూర్తిగా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్ ఇటీవలి ఫామ్, బౌలింగ్ భారాన్ని కూడా సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik pandya) గతేడాది మార్చి నుంచి భారత్ తరపున వన్డేలు ఆడలేదు. ఈ సిరీస్ ద్వారా వన్డే జట్టులోకి అతను పునరాగమనం చేయడంపై, అలాగే వన్డేల్లో నిలకడగా బౌలింగ్ చేయగల అతని శారీరక సామర్థ్యంపై సెలెక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా సీనియారిటీని నమ్మాలా, లేక ఇటీవల అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న అక్షర్ పటేల్‌కు(Axar Patel) అవకాశం ఇవ్వాలా అనే సందిగ్ధంలో ఎంపిక కమిటీ ఉంది. అయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్థానానికి మాత్రం వన్డే జట్టులో ఎలాంటి ముప్పు లేదు. వన్డే జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడిపై ఇటీవల కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనప్పటికీ, అతని అపారమైన అనుభవం దృష్ట్యా వన్డే బ్యాటింగ్ లైనప్‌కు అతనే ప్రధాన పిల్లర్‌గా ఉంటాడని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. యువ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అలాగే ఇటీవల సెన్సేషన్ సృష్టించిన నితీష్ కుమార్ రెడ్డి పేర్లు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నాయి. నేటి సాయంత్రం లోపు బీసీసీఐ అధికారికంగా భారత టెస్ట్, వన్డే జట్లను ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి






