టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన నిర్ణయం.. బులెట్ ప్రూఫ్ వెహికల్ వద్దు..!
ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు హోదా, ప్రోటోకాల్స్, అదనపు భద్రత కోసం ఆరాటపడుతుంటే, ఆయన మాత్రం ఇందుకు భిన్నంగా వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికారు. ప్రజా ధనం, ఇంధనం వృథా కాకూడదనే ఉద్దేశంతో తనకు కేటాయించిన హై-ప్రొఫైల్ సెక్యూరిటీని, వాహనాన్ని తిరస్కరిస్తూ పల్లా శ్రీనివాస్(Palla Srinivas) తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనల కోసం ప్రభుత్వం అత్యంత భద్రత కలిగిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. అయితే ప్రస్తుత ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారీ మైలేజ్ వినియోగించే ఆ వాహనాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ కారును తిరిగి పోలీస్ శాఖకు అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనవసరపు హంగుల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని తగ్గించడమే ఆయన ముఖ్య ఉద్దేశం.
వాహనంతో పాటు భద్రత విషయంలోనూ పల్లా శ్రీనివాస్ కీలక మార్పులు చేశారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం తనకు ఉన్న 2+2 గన్మెన్ల భద్రత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే తనకు కేవలం 1+1 గన్మెన్లు ఉంటే సరిపోతుందని పోలీస్ అధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు ప్రస్తుతం ఆయన సెక్యూరిటీని 1+1 కి పరిమితం చేశారు. మితిమీరిన సెక్యూరిటీ బందోబస్తు ఉంటే సామాన్య ప్రజలను, కార్యకర్తలను కలుసుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రతినిధులు హుందాగా, ఆడంబరాలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పిలుపునిచ్చారు. పార్టీలో కీలక పదవిలో ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆ పిలుపును నిజం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది.
ఇవి కూడా చదవండి






