చంద్రబాబుకు ఉన్న టైం సెన్స్, సీఆర్డీఏ అధికారులకు లేదా..?
రాజధాని అమరావతి(Amaravati) పరిధిలోని తుళ్లూరులో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) అధికారుల ఉదాసీన వైఖరిపై స్థానిక రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తుళ్లూరులో స్థానిక సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభ నుంచి రైతులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసనగా వెనుదిరిగారు. అధికారుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు నిరసనగా గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు రైతులు ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 9:30 గంటలకే గ్రామసభ ప్రారంభం కావాల్సి ఉంది. దీంతో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకుని ఎదురుచూశారు. అయితే, గంటలు గడుస్తున్నా సభను నిర్వహించాల్సిన సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడంతో రైతులు తీవ్రంగా మండిపడ్డారు. అధికారుల కోసం తాము ఎంతసేపు వేచి ఉండాలని, కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం వారి బేఖాతరుతనానికి నిదర్శనమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పనితీరును ఉదహరిస్తూ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. “రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఏ కార్యక్రమానికైనా నిర్దేశిత సమయానికి వస్తూ పక్కాగా రూల్స్ పాటిస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారు” అని రైతులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించి బాధ్యులైన సీఆర్డీఏ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి






