19th May 2026

____________

- Saidulu

కూరగాయలు శుభ్రం చేయడంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినా.. వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు శరీరానికి హానికరం కావచ్చు. అందుకే వండే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. ముందుగా నీటితో బాగా కడిగితే మట్టితో పాటు కొన్ని క్రిములు కూడా తొలగిపోతాయి.

ఉప్పు కలిపిన నీటిలో కూరగాయలను 10 నిమిషాలు నానబెడితే పైపొరపై ఉన్న సూక్ష్మ పురుగులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి.

వినిగర్‌ లేదా నిమ్మరసం కలిపిన నీటితో కడగడం కూడా మంచిదే. ఇలా చేస్తే కూరగాయలపై ఉండే రసాయనాల ప్రభావం కొంతవరకు తగ్గుతుంది.

కాలీఫ్లవర్‌, బ్రోకోలీ వంటి కూరల్లో చిన్న పురుగులు దాగి ఉండొచ్చు. వాటిని చిన్న ముక్కలుగా చేసి గోరువెచ్చని నీటిలో నానబెడితే శుభ్రంగా అవుతాయి.

ఆకుకూరలను ఒక్కసారి కడగడం సరిపోదు. రెండు మూడు సార్లు నీటిలో ఊపి వేసి కడిగితే దుమ్ము, మట్టి పూర్తిగా తొలగిపోతాయి.

టమాటా, వంకాయ, దోసకాయలాంటి వాటిని చేతులతో రుద్దుతూ కడగాలి. ఇలా చేస్తే పైపొరపై ఉండే మలినాలు సులభంగా తొలగిపోతాయి.

కూరగాయలను కడిగిన వెంటనే తుడిచి ఆరబెట్టడం మంచిది. తడిగా ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

శుభ్రంగా కడిగిన కూరగాయలతో చేసిన వంటలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు.