బీసీసీఐకి భారీ ఊరట., ఆర్టీఐ పరిధిలోకి రాదు..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కి కేంద్ర సమాచార కమిషన్ (CIC) లో కీలక ఊరట లభించింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం-2005 (RTI) పరిధిలోకి రాదని సీఐసీ అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ బోర్డు అంతర్గత విషయాలు, ఆర్థిక లావాదేవీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన వినతులపై విచారణ జరిపిన కమిషన్.. ఈ మేరకు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ సీఐసీ కమిషనర్ పి.ఆర్.రమేష్ కీలక అంశాలను ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
బీసీసీఐ అనేది పూర్తిగా స్వయంప్రతిపత్తి గల సంస్థ అని, ఇది ప్రభుత్వ యాజమాన్యంలో గానీ లేదా ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, బోర్డు రోజువారీ నిర్వహణకు లేదా కార్యకలాపాలకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని, అందువల్ల ఈ సంస్థను ఆర్టీఐ చట్టం ప్రకారం ‘పబ్లిక్ అథారిటీ’గా పరిగణించలేమని కమిషన్ తేల్చి చెప్పింది. క్రికెట్ బోర్డు ఏర్పాటు వెనుక ఉన్న చట్టపరమైన నేపథ్యాన్ని సీఐసీ తన ఉత్తర్వుల్లో వివరించింది.
బీసీసీఐ అనేది భారత రాజ్యాంగం ద్వారా గానీ, పార్లమెంటు చేసిన ప్రత్యేక చట్టం ద్వారా గానీ లేదా ఏ రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా గానీ ఏర్పడిన సంస్థ కాదని స్పష్టం చేసింది. ఇది కేవలం ‘తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం’ కింద నమోదైన ఒక ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ (Private Body) అని, అందువల్ల దీనిపై ఆర్టీఐ నిబంధనలు వర్తించవని కమిషన్ స్పష్టమైన తీర్పునిచ్చింది.
భారతదేశంలో అత్యంత ధనిక క్రీడా సంస్థగా ఉన్న బీసీసీఐ.. జట్టు ఎంపిక, నిధుల కేటాయింపులు, ఐపీఎల్ (IPL) వంటి మెగా టోర్నమెంట్ల నిర్వహణలో మరింత పారదర్శకతతో వ్యవహరించాలని, అందుకోసం దీనిని ఆర్టీఐ పరిధిలోకి తేవాలని గతంలో పలువురు డిమాండ్ చేశారు. అయితే, తాజాగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఈ స్పష్టతతో బీసీసీఐపై ఆర్టీఐ అస్త్రం చెల్లదనే నయా రూలింగ్ ఖరారైంది.
ఇవి కూడా చదవండి







