ప్రజల ప్రాణాలతో చెలగాటం.. గ్రేటర్ హైదరాబాద్లో 800 నకిలీ క్లినిక్ల గుట్టురట్టు
Fake Doctors: సరైన వైద్య పట్టా లేకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ మున్నాభాయ్లపై చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 ఎఫ్ఐఆర్లు నమోదైనప్పటికీ, తదుపరి కార్యాచరణ ముందుకు సాగకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లినిక్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నా, ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నకిలీ డాక్టర్ల దందా ..
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మొత్తం తనిఖీ చేసిన క్లినిక్లు: 1200
నకిలీవిగా తేలిన క్లినిక్లు: 800
నమోదైన ఎఫ్ఐఆర్లు: 600
హైదరాబాద్ వాటా: నకిలీ వైద్యుల్లో 80 శాతం మంది ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే ఉండటం గమనార్హం. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 200లకు పైగా కేసులు నమోదైనా, చర్యలు శూన్యం కావడంతో టీజీఎంసీ ఇప్పుడు హైకోర్టులో పిల్ (PIL) వేసేందుకు సిద్ధమవుతోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ నకిలీ క్లినిక్లు భారీగా వెలిశాయి.
అనుభవమే అర్హతగా అల్లోపతి వైద్యం..
కొందరు ఆసుపత్రుల్లో సహాయకులుగా పనిచేసి, ఆ అనుభవంతో ఏకంగా క్లినిక్లు నడుపుతుండగా.. మరికొందరు హోమియోపతి చదివి అల్లోపతి వైద్యం చేస్తున్నారు. ఇంకొందరు ఆర్ఎంపీలుగా పనిచేస్తూ ఏకంగా 10-15 పడకల ఆసుపత్రులనే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వీరు అవసరం లేకున్నా అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇస్తూ రోగుల మూత్రపిండాలు, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు.
కఠిన చట్టాలున్నా కదలని యంత్రాంగం..
తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం , నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చట్టం సెక్షన్లు 34, 35 ప్రకారం నకిలీ వైద్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసుల సహకారంతో క్లినిక్లను సీజ్ చేసే అధికారం ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు క్లినిక్లు మూసివేసి, కొద్దిరోజుల తర్వాత మరో పేరుతో మళ్లీ దందాను మొదలుపెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ నకిలీ వైద్యులపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.






