హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊరట.. త్వరలో 60 కొత్త కోచ్‌ల కొనుగోలు
New Metro Coaches:హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ సుమారు 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థతో దీనికి సంబంధించిన సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ వారంలోనే కోచ్‌ల తయారీ సంస్థతో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
15 నెలల్లో సరఫరా..
ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచి 15 నెలల వ్యవధిలో కోచ్‌లను సరఫరా చేయగలమని తయారీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపింది. ప్రస్తుతం మెట్రోలోని మూడు కారిడార్లలో 56 మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఒక్కో మెట్రోలో మూడు కోచ్‌లు ఉంటున్నాయి. అయితే ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ముఖ్యంగా నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో ఇప్పుడున్న కోచ్‌లు ఏమాత్రం సరిపోవడం లేదు.
ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో మోక్షం..
మెట్రో రైలు ప్రభుత్వం ఆధీనంలోకి రావడంతో కొత్త కోచ్‌ల కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ నుంచి కోచ్‌లను కొనుగోలు చేయగా, ఇప్పుడు స్వదేశీ సంస్థ అయిన BEML కు ఆర్డర్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లెస్ సాంకేతికతకు అనుగుణంగా ఈ కొత్త కోచ్‌లను డిజైన్ చేయనున్నారు. ఒక్కో రైలులో 965 మంది ప్రయాణించేలా వీటిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల మెట్రోలకు BEML కోచ్‌లను సరఫరా చేస్తోంది.
కొత్త కోచ్‌లు అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణం మరింత సుఖవంతం కానుంది.







