ఏపీ ఇరిగేషన్ క్యాలెండర్, చంద్రబాబు కొత్త ట్రెండ్..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ఆలస్యం కాకుండా రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ఇరిగేషన్ క్యాలెండర్‌ను ఖరారు చేశారు. ఈ క్యాలెండర్ ప్రకారం రాబోయే కాలంలో అన్ని ప్రధాన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జలధార, జలహరతి పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాల్వలకు సకాలంలో నీటిని విడుదల చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం(Polavaram Project) ప్రాజెక్ట్ నిర్వాసితుల తరలింపు ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. దీనితో పాటు పోలవరం ఎడమ కాల్వ మరియు చంపావతి లింక్‌పై తక్షణమే సమగ్ర అధ్యయనం చేపట్టాలని సూచించారు. ఈ ఇరిగేషన్ క్యాలెండర్లో పోలవరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 11 కీలక ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం 2026 జూన్ నాటికి కాటన్ బ్యారేజ్ గేట్ల ఫౌండేషన్ పనులు, జూన్ లేదా జూలై నాటికి తుంగభద్ర కొత్త గేట్ల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 2026 జూలై నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ, గుంటూరు ఛానల్ ఆధునీకరణ ఫౌండేషన్ పనులు పూర్తి కానున్నాయి. 2026 ఆగస్టు నాటికి వెలిగొండ ఫేజ్-1, హంద్రీ నీవా బ్రాంచ్ ఫౌండేషన్, గాలేరు నగరి ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు 2026 అక్టోబర్ నాటికి హంద్రీ-నీవా ఫేజ్-2 (నీవా బ్రాంచ్ కెనాల్ వరకు), నవంబర్ నాటికి నేరడి బ్యారేజ్ ఫౌండేషన్, డిసెంబర్ నాటికి పెన్నా-సర్వేపల్లి పనులను ముగించనున్నారు.
వచ్చే 2027 సంవత్సరంలో మరికొన్ని కీలక ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2027 జనవరి నాటికి మద్దువలస ఫేజ్-2, నీవా బ్రాంచ్ కెనాల్ (మూలపల్లి వరకు) పనులు పూర్తవుతాయి. ఏప్రిల్ నాటికి హీర మండలం ఎత్తిపోతల పథకం, జూన్ నాటికి నాగావళి-చంపావతి నదుల లింక్, ముక్త్యాల ఎత్తిపోతల పథకంతో పాటు ప్రధాన పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. అదే సమయంలో బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ కింద అండర్ టన్నెల్, డ్రైనేజ్ ఛానల్ పనులను కొల్లేరు వరకు పూర్తి చేస్తారు.
2027 జూన్ లేదా జూలై నాటికి చింతలపూడి(Chintalapudi) ఎత్తిపోతల పథకం ఫేజ్-1, జూలై నాటికి మహేంద్ర తనయ, గజపతినగరం(Gajapathi Nagaram) బ్రాంచ్ కెనాల్, తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ, వంశధార ఫేజ్-2 స్టేజ్-2 (హిర మండలం బ్యారేజ్) పనులు పూర్తి కానున్నాయి. అదే ఏడాది డిసెంబర్ నాటికి తారక రామతీర్థ సాగర్, మూలపల్లి లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్, ఝంఝావతి రిజర్వాయర్ పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక 2028 సంవత్సరానికి సంబంధించి సుదూర లక్ష్యాలను కూడా ఈ క్యాలెండర్లో చేర్చారు.
2028 జూన్ నాటికి వేదవతి ఎత్తిపోతల పథకం, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్, జీఎన్ఎస్ఎస్ కెనాల్ (కడప వరకు), సోమశిల-స్వర్ణముఖి లింక్, గోదావరి డెల్టా మోడ్రనైజేషన్ పనులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చివరగా 2028 డిసెంబర్ నాటికి శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వైడనింగ్, గాలేరు-నగరి (కడప, కోడూరు వరకు), కోడూరు-బాలాజీ సాగర్, మరియు వరికిపూడిసెల ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అందించాలని జలవనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసారు చంద్రబాబు.
ఇవి కూడా చదవండి







