ఐపీఎల్ బెట్టింగ్ కొత్త ఎత్తులు.. మంత్రగాళ్ల వేషంలో పందెం రాయుళ్లకు గాలం
IPL Betting Mafia: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆసరాగా చేసుకుని బెట్టింగ్ ముఠాలు సరికొత్త ఎత్తుగడలతో రెచ్చిపోతున్నాయి. గతంలో కేవలం ఫోన్ల ద్వారా సాగే బెట్టింగ్‌లు, ఇప్పుడు మూఢనమ్మకాల ముసుగులో యువతను ఆకర్షిస్తున్నాయి. తాము మంత్రశక్తులతో మ్యాచ్ ఫలితాలను ముందే ఊహిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పందెం రాయుళ్లను బురిడీ కొట్టిస్తున్నాయి.
నిమ్మకాయలు.. క్షుద్ర విద్యలు..
ఇటీవల హైదరాబాద్ (SRH) , చెన్నై (CSK) జట్ల మధ్య జరిగిన పోరులో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. స్టేడియంలోని ఒక యువకుడు చేతిలో నిమ్మకాయలు పట్టుకుని బ్యాటర్ల వైపు చూపిస్తూ వింత చేష్టలు చేయడం చర్చనీయాంశమైంది. అతను అలా చేయగానే బ్యాటర్ అవుట్ కావడంతో, దానిని ‘కాలా జాదూ’ (క్షుద్ర విద్యలు) గా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే స్టేడియం పరిసరాల్లో చిలక జోస్యం ద్వారా జట్ల గెలుపోటములను నిర్ణయిస్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.
సోషల్ మీడియాలో ‘డెవిల్స్ ప్రిడిక్షన్’..
టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్‌లలో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి, మంత్రగాళ్ల వేషధారణతో ‘డెవిల్స్ ప్రిడిక్షన్’ పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. తాము చెప్పిన జట్టుపై పందెం కాస్తే భారీగా డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తూ, వారిని వాట్సాప్ లింకుల ద్వారా రహస్య గ్రూపుల్లోకి లాగుతున్నారు.
పోలీసుల హెచ్చరిక..
ఇదంతా బెట్టింగ్ మాఫియా పక్కా ప్రణాళికతో చేస్తున్న మాయాజాలమని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మూఢనమ్మకాలతో మ్యాచ్ ఫలితాలను మార్చలేమని, ఇటువంటి గ్యాంబ్లింగ్ ముఠాల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని యువతను హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి







