డిజిటల్ అరెస్టు పేరిట భారీ దోపిడీ.. వృద్ధుడి నుంచి రూ.63.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
Cyber Crime: సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ పేరిట సరికొత్త దోపిడీకి తెరలేపారు. తాజాగా అల్వాల్‌కు చెందిన ఒక విశ్రాంత ఉద్యోగిని బెదిరించి ఏకంగా రూ.63.35 లక్షలను కాజేశారు. మల్కాజిగిరి సైబర్ పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై పోలీసులమంటూ ఫోన్ కాల్..
అల్వాల్‌లోని వజ్రా ఎన్‌క్లేవ్‌లో నివసించే రంగదాల్ విజయకుమార్ (70) అనే విశ్రాంత ఉద్యోగికి (వృద్ధుడి) మార్చి 20న ఒక గుర్తుతెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాధితుడి ఆధార్ వివరాలతో అక్రమాలు జరిగాయని, దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో క్రిమినల్ కేసు నమోదైందని ఆమె నమ్మబలికింది. ఆ తర్వాత మరికొందరు ముంబై పోలీసులమంటూ వీడియో కాల్స్ చేసి విజయకుమార్ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు.
నకిలీ సుప్రీంకోర్టు పత్రాలతో బెదిరింపులు..
నిందితులు బాధితుడిని మరింత భయపెట్టేందుకు కెనరా బ్యాంకుకు సంబంధించిన పత్రాలను, నకిలీ సుప్రీంకోర్టు కాగితాలను చూపించారు. మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ, అరెస్టు కాకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిపోయిన విజయకుమార్ వారు సూచించిన ఖాతాలకు విడతల వారీగా రూ.63.35 లక్షలను బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా నకిలీ జడ్జీలు, ప్రాసిక్యూటర్లతో న్యాయస్థానం విచారణ జరుగుతున్నట్లు వీడియో కాల్స్ చేసి మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
సైబర్ పోలీసులకు ఫిర్యాదు..
జరుగుతున్న వ్యవహారంపై అనుమానం వచ్చిన విజయకుమార్, ఈ విషయాన్ని తన మనవడికి వివరించారు. అది సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు శనివారం మల్కాజిగిరి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులు చేసే వీడియో కాల్స్ చూసి భయపడవద్దని, ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.






