మీరు తీసుకోని అప్పులు మీ పేరు మీద ఉన్నాయా? అయితే సిబిల్ రిపోర్ట్‌లో తప్పులను సరిచేసుకోండిలా
Credit Score: ప్రస్తుత కాలంలో ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు కావాలన్నా బ్యాంకులు చూసే మొదటి ప్రామాణికం ‘క్రెడిట్ స్కోర్’. మూడు అంకెల ఈ నంబర్ బాగుంటేనే తక్కువ వడ్డీకి లోన్లు లభిస్తాయి. అయితే, బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పంపే డేటాలో తప్పుల వల్ల ఎంతో మంది నిజాయితీ గల కస్టమర్ల స్కోర్ దారుణంగా పడిపోతోంది. మీరు తీసుకోని అప్పులు కూడా మీ ఖాతాలో కనిపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
షాకింగ్ అనుభవాలు..
ఇటీవల సోషల్ మీడియాలో పలువురు ఇన్వెస్టర్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఒక వ్యక్తి తన బిడ్డ చదువు కోసం లోన్ ప్రయత్నిస్తుంటే, అతను ఎప్పుడూ వాడని ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై బకాయి ఉన్నట్లు చూపించి స్కోర్ తగ్గించేశారు. మరో వ్యక్తి ఖాతాలో ఎప్పుడూ వినని ఫైనాన్స్ కంపెనీ నుంచి లక్ష రూపాయల బాకీ ఉన్నట్లు తప్పుడు రిపోర్టులు వచ్చాయి. ఇలాంటి ‘ఫేక్ లోన్లు’ ఎంతో మంది భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి.
తప్పులను సరిచేసుకోవడం ఎలా?
ముందుగా సిబిల్ (CIBIL) వెబ్సైట్ నుంచి మీ రిపోర్టును డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ పేరు, పాన్ నంబర్, అకౌంట్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఏదైనా తప్పు కనిపిస్తే సిబిల్ పోర్టల్‌లోని ‘Dispute Center’లో ఫిర్యాదు చేయండి. తగిన ఆధారాలు అప్లోడ్ చేస్తే 30 నుండి 45 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. బ్యాంకులు మీ ఫిర్యాదుపై 30 రోజుల్లో స్పందించకపోతే, నేరుగా ఆర్బీఐ (RBI) ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయవచ్చు. సంస్థల నిర్లక్ష్యం వల్ల మీ స్కోర్ దెబ్బతింటే, కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి నష్టపరిహారం కోరే హక్కు మీకు ఉంటుంది. మీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి (Identity Theft) ఎవరైనా లోన్లు తీసుకున్నారని అనుమానం ఉంటే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించండి.
మీ క్రెడిట్ రిపోర్టును తరచుగా చెక్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.






