ఇన్స్టాగ్రామ్ పరిచయం.. వాట్సాప్ చాటింగ్.. గిఫ్టుల పేరుతో 3 లక్షలు టోకరా
Cyber Crime:విదేశాల నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని పొందాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోషల్ మీడియా పరిచయం..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, మునగనూరుకు చెందిన ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాని ద్వారా ఫేస్బుక్, వాట్సాప్‌లలో ‘మిస్ గ్వెండోలిన్ కావెండిష్’ అనే పేరుతో పరిచయమైన మహిళతో అతను చాటింగ్ చేశాడు. తాను అమెరికా నివాసిని అని చెప్పుకున్న ఆ మహిళ, పలు వాట్సాప్ నంబర్ల ద్వారా నమ్మకంగా మాట్లాడుతూ.. ఐఫోన్, చేతి గడియారం వంటి ఖరీదైన వస్తువులను బహుమతిగా పంపిస్తానని చిప్పింది.
కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో దోపిడీ..
ఈ నెల 11న అమెరికా నుంచి ఇండియాకు బహుమతులు వచ్చాయని నమ్మిస్తూ పార్శిల్ ట్రాకింగ్ వివరాలను కూడా పంపింది. అంతలోనే ఢిల్లీ నుంచి కస్టమ్స్ సర్వీస్ , కొరియర్ ఏజెన్సీ ప్రతినిధులమంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. పార్శిల్ క్లియర్ కావాలంటే కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని కోరడంతో, బాధితుడు విడతల వారీగా రూ.3 లక్షలను వారు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు..
డబ్బులు చెల్లించినప్పటికీ కొరియర్ రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు, తాను మోసపోయానని గ్రహించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు ప్రమాదకరమని, బహుమతుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






