కర్నాటకలో కొత్త డిమాండ్.. సీఎంగా పరమేశ్వరన్?
కర్నాటకలో కాంగ్రెస్ కి రోజూ తలనొప్పులే. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రోజూ డైలాగ్ వార్ నడుస్తుంది. తనను సీఎం చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది? మీరు సీఎం పదవిని విడవరా? అంటూ డీకే శివకుమార్ రోజూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వుంటారు. నిజానికి రెండున్నర సంవత్సరాలు సిద్దరామయ్య, మరో రెండున్నర సంవత్సరాలు డీకే సీఎంగా వుండాలని ఓ ఒప్పందం కుదిరిందని అంటుంటారు. కానీ.. సిద్దరామయ్య మాత్రం సీఎం పదవిని విడిచిపెట్టడంలేదు.
దీంతో డీకే శివకుమార్, ఆయన వర్గీయులు రోజూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వుంటారు. దీంతో అధిష్ఠానం టెన్షన్ పడుతోంది. కర్నాటక లాంటి కీలకమైన రాష్ట్రంలో ఈ తలనొప్పులు ఏంటని అసహనం కూడా వ్యక్తం చేస్తుంది. దీంతో వారిద్దరి మధ్య ఓసారి బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, లంచ్ సమావేశాలు కూడా జరిగాయి. కానీ.. ఓ కొలిక్కి రావడం లేదు.
తాజాగా… డీకే శివకుమార్ వర్గీయులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘‘కాబోయే సీఎం డీకే’’ అంటూ అంతటా పోస్టర్లు, బ్యానర్లు పెట్టారు. దీంతో మళ్లీ వివాదం మొదటికే వచ్చేసింది. ఎలాగైనా తమ నేతకు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని తెగ పట్టుబడుతున్నారు. దీంతో అధిష్ఠానానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మధ్యే మార్గంగా సీనియర్ మంత్రి పరమేశ్వరన్?
అయితే.. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. హోంమంత్రిగా వున్న సీనియర్ పరమేశ్వరన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. దీని ద్వారా మధ్యేమార్గంగా బాగుంటుందని డిమాండ్ తెచ్చారు. దీంతో కొత్త మలుపు తిరిగింది.
పరమేశ్వరన్ చాలా సీనియర్ అని, సీఎం అవ్వడానికి అన్ని అర్హతలూ వున్నాయని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పరమేశ్వరన్ ను సీఎంచేయాలని అంటున్నారు. అలాగే ఎప్పటి నుంచో పరమేశ్వరన్ సీఎం పదవి కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు. పరమేశ్వర ఎనిమిదేళ్ల పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారని, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన స్థానంలో గెలిచి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని అంటున్నారు.
కర్ణాటకలో ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలోని కొన్ని వర్గాల నుండి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే, ప్రముఖ పేర్లలో ఒకరిగా పరమేశ్వర పరిగణించబడుతున్నారు.






