వచ్చే సీజన్ లో కూడా ధోనీ ఆడతాడా..?
టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ రిటైర్మెంట్పై గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక మ్యాచ్ టాస్ సందర్భంగా ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ధోనీ ఆడే అంశంపై అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. టాస్ ప్రెజెంటర్ రవిశాస్త్రి అడిగిన ప్రత్యేక ప్రశ్నకు రుతురాజ్ స్పందిస్తూ, ధోనీ ఇంకా జట్టుతోనే ఉన్నాడని, అయితే ప్రస్తుత మ్యాచ్ ఆడేందుకు పూర్తిగా ఫిట్ గా లేడని వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ సమయానికి ధోనీ కోలుకుని అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రుతురాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అప్డేట్తో ధోనీ ఇంకా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పలేదనే విషయం స్పష్టమవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు, ధోనీ తదుపరి ఐపీఎల్ 2027 సీజన్లో కూడా ఆడబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక సందర్భంలో ధోనీ మాట్లాడుతూ.. తాను తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను సీఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చెన్నైలోని ‘చెపాక్’ (Chepauk) స్టేడియంలోనే ఆడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
అయితే ప్రస్తుత టోర్నమెంట్లో చెపాక్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనీ ఆడలేదు. దీనిని బట్టి చూస్తే, చెపాక్ ప్రేక్షకుల మధ్యే ఆఖరి మ్యాచ్ ఆడాలనే తన కోరికను నెరవేర్చుకోవడం కోసం థలా కచ్చితంగా వచ్చే సీజన్లోనూ బరిలోకి దిగుతారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసును మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. నిన్నటి ఓటమితో చెన్నై దాదాపుగా టోర్నీ నుంచి వైదోలిగినట్లే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది.






