మే 7, 8 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్, వేదికగా నూతన సీఆర్డీఏ కార్యాలయం..!
రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేసేందుకు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మరోసారి జిల్లా కలెక్టర్లతో ముఖాముఖి భేటీ కానున్నారు. మే 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ భారీ సమావేశానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 28 జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. సాధారణంగా కలెక్టర్ల సమావేశాలు సచివాలయంలో జరుగుతుంటాయి. అయితే, ఈసారి ప్రభుత్వం వేదికను మార్చే ఆలోచనలో ఉంది.
ఇవి కూడా చదవండి
నూతనంగా నిర్మించిన సీఆర్డీఏ (CRDA) కార్యాలయాన్ని ఈ సమావేశానికి వేదికగా ఎంపిక చేసినట్లు సమాచారం. అక్కడ నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ అత్యంత విశాలంగా ఉండటంతో పాటు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డిజిటల్ స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రజెంటేషన్లు ఇవ్వడానికి, జిల్లాల వారీగా డేటాను విశ్లేషించడానికి ఈ భవనం అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానంగా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించనున్నారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రోడ్ల మరమ్మతులు, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల పురోగతిపై కలెక్టర్లకు దిశానిర్దేశం, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ప్రజల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశ తేదీలకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ (GAD) నుండి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రాథమిక సమాచారం అందింది. దీనిపై అధికారిక జీఓ త్వరలోనే విడుదల కానుంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత జరుగుతున్న పూర్తిస్థాయి కలెక్టర్ల సమావేశం కావడంతో, పాలనలో వేగం పెంచేలా సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి






