ప్రజలపై ‘నాలా’ భారం.. హెచ్ఎండీఏ నిర్లక్ష్యంతో దరఖాస్తుదారులకు శాపం
HMDA: హైదరాబాద్ పరిధిలో ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల ప్రక్రియలో హెచ్ఎండీఏ (HMDA) నిర్లక్ష్యం దరఖాస్తుదారులకు పెద్ద శాపంగా మారింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ‘నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్’ (NALA) కన్వర్షన్ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన ‘బిల్డ్ నో’ (Build No)తో పాటు పాత ‘డీపీఎంఎస్’ (DPMS) విధానంలోనూ ఈ గేట్‌వే అనుసంధానం కాకపోవడం రియల్ ఎస్టేట్ రంగానికి తలనొప్పిగా మారింది.
2 నుండి 3 నెలల సుదీర్ఘ సమయం..
సాధారణంగా బిల్డింగ్, లేఅవుట్ ఫీజుల తరహాలోనే ‘నాాలా’ ఫీజుకు కూడా పక్కనే ‘పే నౌ’ (Pay Now) అనే ఆన్లైన్ ఆప్షన్ ఉండాలి. కానీ హెచ్ఎండీఏ పోర్టల్‌లో ఈ ఆప్షన్ లేకపోవడంతో, దరఖాస్తుదారులు నేరుగా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి చలానా చెల్లించి ‘క్లియరెన్స్ సర్టిఫికేట్’ తీసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాతే దాన్ని మళ్లీ హెచ్ఎండీఏ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుండి 3 నెలల సుదీర్ఘ సమయం పడుతోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
మార్కెట్ విలువ పెరిగితే అదనపు భారం..
‘నాాలా’ కన్వర్షన్ ఫీజును భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, హెచ్ఎండీఏ ఆలస్యం కారణంగా నెలల తరబడి ప్రక్రియ సాగుతున్న సమయంలో.. ఒకవేళ భూమి మార్కెట్ విలువ పెరిగితే, ఆ పెరిగిన రేట్ల ప్రకారం అదనపు భారం కూడా దరఖాస్తుదారులపైనే పడుతోంది.
‘బిల్డ్ నో’ లోనూ అదే పరిస్థితి..
నూతనంగా ప్రవేశపెట్టిన ‘బిల్డ్ నో’ విధానంలో సైతం నాాలా ఛార్జీల చెల్లింపునకు సంబంధించి రెవెన్యూ శాఖతో ఇంకా రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ పూర్తి కాలేదు. 2024 కంటే ముందు అనుమతులు తీసుకున్న దాదాపు వెయ్యి ప్రాజెక్టులు ఇంకా డీపీఎంఎస్లోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
బిల్డర్లు, దరఖాస్తుదారుల డిమాండ్లు..
దరఖాస్తు చేసిన రోజున ఉన్న మార్కెట్ విలువనే నాాలా ఛార్జీలకు ప్రామాణికంగా తీసుకుని ఫ్రీజ్ (లాక్ ఇన్ డేట్) చేయాలి. పాత దరఖాస్తుల పరిష్కారం అయ్యే వరకు డీపీఎంఎస్‌తో పాటు ‘బిల్డ్ నో’ లోనూ నాాలా చెల్లింపుల కోసం తక్షణమే ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేను తీసుకురావాలి. ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారికి తాత్కాలిక ఎన్ఓసీ (NOC) ఇచ్చి, మార్ట్‌గేజ్‌ను పాక్షికంగా విడుదల చేయాలి.
ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై హెచ్ఎండీఏ ఈ సాగతీత ధోరణి తీవ్ర ప్రభావం చూపుతోందని రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి






