ఆ 100 వస్తువులు దేశంలోనే తయారీ! మేక్ ఇన్ ఇండియాపై కేంద్రం ఫోకస్..!
విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గిస్తూ, భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ (Make-In-India)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతను మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా వేస్తున్న ఈ భారీ అడుగుల గురించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తాజాగా కీలక విషయాలు వెల్లడించారు.
ఆ 100 వస్తువులపై స్పెషల్ ఫోకస్!
మన దేశంలో అసలు తయారు కాని, లేదా డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని సుమారు 100 వస్తువుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇందులో ప్రధానంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన యాక్సిల్స్, మోటార్‌సైకిల్ విడిభాగాలు వంటివి ఉన్నాయి. ఇప్పటివరకు వీటి కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఇకపై ఈ వస్తువులన్నింటినీ పూర్తిగా స్థానికంగానే (Make-In-India) తయారు చేసేలా సంబంధిత పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.. కేవలం దేశీయ మార్కెట్ అవసరాలు తీర్చడమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయికి మన ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం!
సరికొత్త ‘లోగో’
స్వదేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు కేంద్రం సరికొత్తగా ‘మేడ్ ఇన్ ఇండియా’ (Make-In-India) స్కీమ్‌ను తీసుకురాబోతోంది. ఈ స్కీమ్ కింద కేవలం వస్తువు ఇక్కడ తయారైందని చెప్పడమే కాకుండా, అత్యుత్తమ నాణ్యత (Quality) ఆధారంగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ లోగో (Logo)ను కేటాయిస్తారు. “ఈ లోగో ఆ వస్తువుపై ఉందంటే.. అది నాణ్యతలో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోందని కొనుగోలుదారులకు ఒక బలమైన నమ్మకం కలుగుతుంది” అని ప్రభుత్వం భావిస్తోంది. ఏయే రంగాల ఉత్పత్తులకు ఈ ప్రత్యేక గుర్తింపునివ్వాలన్న దానిపై ప్రస్తుతం పరిశ్రమల వర్గాలతో కసరత్తు సాగుతోంది.
ఏఐ టెక్నాలజీ, ఎఫ్‌టీఏలతో గ్లోబల్ ఛాన్స్!
ప్రస్తుత ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంతో ఉత్పాదకత, కొత్త ఆవిష్కరణలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఏఐ టెక్నాలజీ సహాయంతో మారుతున్న గ్లోబల్ సప్లై చైన్ విధానాలను అందిపుచ్చుకోవాలని, ఈ పెను మార్పులకు పరిశ్రమలు (Make-In-India) సిద్ధంగా ఉండాలని అమర్దీప్ సింగ్ సూచించారు. దీనికి తోడు, విదేశీ మార్కెట్లలో భారతీయ కంపెనీల ప్రాబల్యం పెంచేందుకు.. ఇతర దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) ఒక అద్భుతమైన మార్గంగా మారనున్నాయని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి విదేశీ వస్తువుల మోజు నుంచి.. నాణ్యమైన ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ వైపు భారత్ వేస్తున్న ఈ అడుగులు దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేయనున్నాయి.
ఇవి కూడా చదవండి






