పింఛన్దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. నేరుగా ఇళ్ల వద్దకే సెర్ప్ సిబ్బంది
Pension Update: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు భవిష్యత్తులో మరింత సులభంగా, సక్రమంగా పింఛన్ డబ్బులు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పింఛన్దారుల వేలిముద్రలు (Biometrics), ముఖ గుర్తింపు (Facial Recognition) వివరాలను ఒకే యాప్లో నమోదు చేసి, ప్రతి నెల ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛన్ ఇచ్చేందుకు నిర్ణయించింది.
‘జీవన నిర్ధారణ’ (లైవ్ అథెంటికేషన్) పేరుతో ఉన్న ఈ ప్రత్యేక యాప్ ద్వారా జీహెచ్ఎంసీ, సీడీఎంఏ, ఎంపీడీఓలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పింఛనుదారుల వివరాలను సేకరిస్తున్నారు. దీనికోసం మెప్మా (MEPMA), సెర్ప్ (SERP) అధికారులు జూన్ 15 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వార్డు, డివిజన్ కేంద్రాల పరిధిలో పెన్షనర్ల డేటాను నమోదు చేస్తున్నారు.
విదరాలు..
సెర్ప్ సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకే ..
పింఛన్ల కోసం వయోధికులు, వివిధ అనారోగ్య సమస్యలతో (రుగ్మతలతో) బాధపడుతున్న వారు కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడకుండా సెర్ప్ సిబ్బంది నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్తున్నారు. అక్కడే ‘జీవన నిర్ధారణ’ యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖ గుర్తింపు, వేలిముద్రల ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ సమాచారాన్ని బ్యాంకర్లకు, పోస్టల్ అధికారులకు కూడా అనుసంధానం చేస్తుండటంతో భవిష్యత్తులో పింఛన్లు సక్రమంగా అందుతాయని మేడ్చల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి సాంబశివరావు తెలిపారు.
జిల్లాల వారీగా లబ్ధిదారుల అంచనా..
- రంగారెడ్డి జిల్లాలో పింఛన్దారులు: 1.25 లక్షల మంది
- మేడ్చల్ జిల్లాలో పింఛన్దారులు: 1.42 లక్షల మంది
వీటిలో ఫైలేరియా, డయాలసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు సుమారు 10 నుండి 15 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరణించిన వారి సమాచారం ఇస్తే రూ. 20 వేల సాయం..
2022 జనవరి నుంచి ఇప్పటివరకు అల్పఆదాయ వర్గాల్లో ఎవరైనా కుటుంబ పెద్ద మరణించి ఉంటే, ఆ సమాచారాన్ని తక్షణమే రెవెన్యూ అధికారులకు అందించాలని అధికారులు కోరారు. ‘నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్’ (National Family Benefit) పథకం కింద ఆయా బాధిత కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అర్హులైన వారు మీ-సేవ, తహసీల్దార్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.






