యువతకు ఉపాధి బాట.. తెలంగాణలో దూసుకుపోతున్న ఫార్మా విలేజెస్
Pharma Sector: తెలంగాణలో బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) భారీగా ప్రారంభమవుతుండటంతో సైన్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ‘తెలంగాణ రైజింగ్-2047’ సదస్సు తర్వాత పలు బహుళజాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ప్యూర్ (పెరి-అర్బన్.. రూరల్.. ఎకానమీ) పరిధిలో ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తుండటం ఈ రంగానికి మరింత ఊతాన్ని ఇస్తోంది.
ఫార్మా గ్రామాలు – ఫ్యూచర్ సిటీ విస్తరణ..
పరిశ్రమల అవసరాల కోసం చేవెళ్ల వద్ద దాదాపు 1200 ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం సేకరించింది. రవాణా సౌకర్యం కోసం రేడియల్ రోడ్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో కొత్తగా 16 ఫార్మా కంపెనీలు రాబోతుండగా, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) సమీపంలో అంతర్జాతీయ ఫార్మా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా ‘ఫార్మా విలేజెస్’ అందుబాటులోకి వస్తుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది.
కీలక గణాంకాలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 600కు పైగా ఫార్మా కంపెనీలు, 200కు పైగా బయోటెక్నాలజీ సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పరిశ్రమల ఉమ్మడి వార్షిక టర్నోవర్ 45 నుండి 55 బిలియన్ డాలర్ల వరకు ఉండటం విశేషం. పరిశోధనలు, రోగ నిర్ధారణ రంగాల్లోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోంది. నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 17 ప్రపంచవ్యాప్త పరిశోధన కేంద్రాలు ఉండగా, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన 20 రోగ నిర్ధారణ పరీక్షల ల్యాబ్‌లు ఇక్కడ సేవలందిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘ఫార్మా గ్రామాల’ (Pharma Villages) ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో దాదాపు 5 లక్షల మందికి పైగా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
లక్ష మంది విద్యార్థులకు వరం..
రాష్ట్రంలో ఏటా లక్ష మంది వరకు బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరుతున్నారు. వీరిలో 5-10 శాతం మంది కోర్సులు పూర్తి కాగానే ఐసీటీ, నైపర్, రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో జూనియర్ శాస్త్రవేత్తలుగా, ఇతర కీలక ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.
ప్రాణాధార మందుల తయారీ..
దేశంలోని మొత్తం ఫార్మా, బయోటెక్ ఉత్పత్తుల్లో 35 శాతం తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం. ఇక్కడి నుండి విదేశాలకు సైతం మందులు భారీగా ఎగుమతి అవుతున్నాయి. ‘వికసిత్ భారత్’లో భాగంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 21 ఫార్మా గ్రామాలు ఏర్పాటు కానున్నాయి. మొదటి దశ, రెండో దశల్లో భాగంగా వికారాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి






