ఇళ్లలో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించండి! మీకోసం కేంద్రం తెస్తున్న ప్లాన్ ఇదే..!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా భారతీయ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. ఈ కఠిన పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన వ్యూహానికి పదునుపెడుతోంది. అదేంటంటే.. మన దేశంలో ప్రజల ఇళ్లల్లో, లాకర్లలో మురిగిపోతున్న టన్నుల కొద్దీ బంగారాన్ని (Gold) బయటకు తీసి, దాన్ని నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థలోకి మళ్లించే సరికొత్త మాస్టర్ ప్లాన్!
ఇళ్లల్లో ఎంత బంగారం ఉందో తెలుసా?
భారతీయులకు బంగారంపై (Gold) ఉన్న పిచ్చి, ప్రేమ ప్రపంచంలో మరెవరికీ ఉండదేమో. ఈ మోజు కారణంగానే ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ప్రజల ఇళ్లలో, లాకర్లలో సుమారు 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం నిరుపయోగంగా పడి ఉందని ఓ అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరోవైపు మన దేశ అవసరాల కోసం ఏటా 700 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వేల కోట్ల డాలర్లను వృధా చేస్తున్నాం. దీనివల్ల రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితిని మార్చడానికే కేంద్ర ప్రభుత్వం గతంలో విఫలమైన ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (GMS)’ను ఇప్పుడు కొత్త హంగులతో, సరికొత్త వెర్షన్లో తీసుకురాబోతోంది.
ఇవి కూడా చదవండి
మీ పసిడికి మీకే వడ్డీ..
కేంద్రం తీసుకురానున్న ఈ కొత్త పథకం అచ్చం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) లాగే పనిచేస్తుంది. కానీ ఇక్కడ మీరు దాచేది డబ్బులు కాదు.. బంగారం! మీ వద్ద ఉన్న బంగారు కడ్డీలు, నాణేలు లేదా ఆభరణాలను బ్యాంకులు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల్లో డిపాజిట్ చేయాలి. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం మీకు ఏటా 2 నుంచి 2.5 శాతం వరకు వడ్డీని చెల్లిస్తుంది. (అంటే బంగారం ధర పెరగడంతో వచ్చే లాభానికి అదనంగా ఈ వడ్డీ మీ ఖాతాలో పడుతుంది). సామాన్యులను ఆకర్షించేందుకు కనీసం 10 గ్రాముల బంగారాన్ని కూడా డిపాజిట్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. మీ డిపాజిట్ కాలపరిమితి (Maturity) తీరిన తర్వాత మీరు దాచిన బంగారాన్ని తిరిగి తీసుకోవచ్చు, లేదా అప్పటి మార్కెట్ ధరకు సమానమైన నగదును కూడా పొందవచ్చు.
సెంటిమెంట్‌కు దెబ్బ పడకుండా రూల్
గతంలో ఈ స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే.. మహిళలు సెంటిమెంట్‌గా భావించే తాళిబొట్లు, ఆభరణాలను బ్యాంకు వాళ్లు కరిగించి, దాని స్వచ్ఛతను లెక్కించి రసీదు ఇచ్చేవారు. మనోభావాలు దెబ్బతినడంతో ఎవరూ ఈ పథకం వైపు మొగ్గుచూపలేదు. అందుకే ఈసారి ఆభరణాలను కరిగించకుండానే వాటిపై రాబడి పొందేలా ‘డీమెటీరియలైజ్డ్’ (డిజిటల్) విధానాన్ని తీసుకురావాలని ఆభరణాల మండలి (GJC) ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జనం నగల కంటే బంగారు (Gold) నాణేలు, కడ్డీల రూపంలో పెట్టుబడులు పెడుతున్నారు. కేవలం 2025లోనే 280 టన్నుల బంగారం పెట్టుబడి రూపంలో అమ్ముడవడమే దీనికి నిదర్శనం. వీటిపై సెంటిమెంట్ తక్కువ కాబట్టి జనం సులభంగా బ్యాంకుల్లో దాస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ స్కీమ్‌తో దేశానికి ఎంత లాభమంటే..
ఇళ్లల్లో మురిగిపోతున్న 30 వేల టన్నుల బంగారంలో కనీసం 2,000 టన్నులు ఈ స్కీమ్ కింద బ్యాంకులకు వచ్చినా చాలు.. రాబోయే మూడేళ్ల పాటు మనం విదేశాల నుంచి ఒక్క గ్రాము పసిడిని కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రాదు. విదేశాలకు వెళ్లే డాలర్లు ఆదా అవుతాయి, రూపాయి బలపడుతుంది. అలాగే బ్యాంకులకు వచ్చిన ఈ బంగారాన్ని లోకల్ జ్యువెలరీ వ్యాపారులకు అవసరాన్ని బట్టి ఇవ్వడం ద్వారా దేశీయంగానే బంగారు వ్యాపారం పరుగెడుతుంది. మొత్తానికి పాత లోపాలను సవరించి, పన్ను వేధింపులు లేకుండా ఈ స్కీమ్‌ను పక్కాగా అమలు చేస్తే.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక ‘గేమ్-ఛేంజర్’గా మారడం ఖాయం!
ఇవి కూడా చదవండి






