వేసవి ఎండలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇంట్లో ఏసీ వినియోగం కూడా ఎక్కువవుతోంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే గది ఎక్కువసేపు చల్లగా ఉండటమే కాకుండా కరెంట్ బిల్లు కూడా తగ్గించుకోవచ్చు.
చాలామంది గది త్వరగా కూల్ అవుతుందని ఏసీని చాలా తక్కువ టెంపరేచర్‌లో పెడతారు. కానీ 24 డిగ్రీల వద్ద ఉంచితే శరీరానికి సౌకర్యంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.
ఏసీని కొద్దిసేపు మాత్రమే ఆన్ చేస్తే గాలి మాత్రమే చల్లబడుతుంది. గోడలు, బెడ్‌లు, ఫర్నిచర్ మాత్రం వేడిగానే ఉండి మళ్లీ గదిని వేడెక్కిస్తాయి.
కనీసం గంటసేపు ఏసీ నడిపితే గదిలోని వస్తువులన్నీ చల్లబడతాయి. దీంతో ఏసీ ఆఫ్ చేసిన తర్వాత కూడా గది కొంతసేపు చల్లగానే ఉంటుంది.
తలుపులు, కిటికీల సందుల ద్వారా చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. అందుకే డోర్ సీల్స్ లేదా మందపాటి కర్టెన్లు వాడితే గదిలో చల్లదనం ఎక్కువసేపు నిలుస్తుంది.
సూర్యరశ్మి నేరుగా గదిలోకి రాకుండా బ్లాక్‌అవుట్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది. ఇవి బయట వేడిని అడ్డుకుని గదిని కూల్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో వాడితే చల్లని గాలి గది మొత్తం వ్యాపిస్తుంది. తర్వాత ఏసీ ఆపినా గది చల్లగా ఉంటుంది.
టీవీ, కంప్యూటర్, పాత బల్బులు వంటి పరికరాలు కూడా వేడిని పెంచుతాయి. అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
ఏసీ ఫిల్టర్లను తరచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. సరైన మెయింటెనెన్స్ ఉంటే ఏసీ పనితీరు మెరుగై కరెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది.