కలకత్తాకు డూ ఆర్ డై..!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. టోర్నమెంట్లో 65వ మ్యాచ్‌గా రాబోతున్న ఈ మ్యాచ్ కేకేఆర్ కు కీలకంగా మారింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత తప్పనిసరి. ప్రస్తుత పాయింట్ల పట్టిక సమీకరణాలను పరిశీలిస్తే.. 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ మ్యాచ్ ఒక ‘డూ ఆర్ డై’ (Do or Die) లాంటిది.
ఈ మ్యాచ్‌లో గనుక కేకేఆర్ ఓడిపోతే ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపు, హార్దిక్ పాండ్యా(Hardik pandya) నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించి 9వ స్థానంలో ఉన్నప్పటికీ, చివరి మ్యాచ్‌ల్లో గెలిచి టోర్నీని గౌరవప్రదంగా ముగించాలని చూస్తోంది. గాయాల నుండి కోలుకుని స్టార్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav), హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడం ముంబైకి అదనపు బలాన్ని ఇస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఉన్న హెడ్-టు-హెడ్ రికార్డులను చూస్తే ముంబై ఇండియన్స్‌దే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ముంబై 25 సార్లు విజయం సాధించగా, కోల్‌కతా కేవలం 11 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. అంతేకాకుండా ఈ సీజన్ మొదటి ఫేస్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై జట్టు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేసి కేకేఆర్‌పై విజయం సాధించింది. హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో, ఇవాళ పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.







