SIR అస్త్రంగా తెలంగాణ బీజేపీ గేమ్ ప్లాన్!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త వ్యూహాత్మక యుద్ధం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జులై 24 వరకు రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, మరణించిన వారి వివరాలను తొలగించడం, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న నకిలీ ఓట్లను ఏరివేయడమే ఈ ఇంటింటి ఓటర్ల సర్వే ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ ప్రభుత్వ అధికారిక ప్రక్రియను ఒక అద్భుతమైన రాజకీయ అవకాశంగా మార్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ సర్వసన్నద్ధమైంది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత విజయవంతమైన ఫలితాలను ఇచ్చిన మైక్రో-లెవెల్ మేనేజ్మెంట్ ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసేందుకు కమలనాథులు పక్కా స్కెచ్ వేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధిష్టానం, రాష్ట్రంలోని జిల్లాలను ఆరు జోన్లుగా విభజించింది. ఎన్నికల నిర్వహణ, సమన్వయాన్ని సులభతరం చేసేందుకు ఒక్కో జోన్ పరిధిలోకి దాదాపు 7 జిల్లాలు వచ్చేలా ప్లాన్ చేశారు. పార్టీలోని కీలక నేతలకు ఒక్కొక్కరికి 7 జిల్లాల చొప్పున పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కేవలం పైస్థాయి ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు ఇళ్లకు వెళ్ళినప్పుడు, వారితో పాటు బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ప్రతి ఇంటినీ సందర్శించనున్నారు. ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి.. అందులో పార్టీ మద్దతుదారులు ఎవరున్నారు, తటస్థంగా ఉన్న ఓటర్లు ఎవరు అనే అంశాలపై స్పష్టమైన మార్కింగ్ చేయనున్నారు. దీని ద్వారా ఏ బూత్‌లో పార్టీ బలం ఎంత ఉందనేదానిపై ఒక కచ్చితమైన అంచనాకు రానున్నారు. ముఖ్యంగా మరణించిన వారి ఓట్లతో పాటు, చొరబాటుదారుల ఓట్లను తొలగించడంపైనే తాము ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు బీజేపీ స్పష్టం చేస్తోంది.
బీజేపీ ఎంచుకున్న ఈ క్షేత్రస్థాయి వ్యూహం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. కాషాయదళం ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ.. పథకం ప్రకారం తమ మద్దతుదారుల ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బీజేపీ మైక్రో-ప్లాన్‌ను తిప్పికొట్టేందుకు ఈ రెండు పార్టీలు కూడా తమ బూత్ లెవెల్ కార్యకర్తలను అప్రమత్తం చేసి, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. జూన్ 25 నుంచి క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఓటర్ల సర్వే వేదికగా గట్టి ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది చివరిలో జరగబోయే GHMC ఎన్నికలపై ఈ సర్వే ప్రభావం ఎలా ఉండబోతోందనే ప్రశ్నే ఇప్పుడు ప్రధాన పార్టీలను తొలిచేస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో స్థానిక జనాభాతో పాటు వలస వచ్చిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎస్ఐఆర్ ద్వారా సేకరించే డేటాను విశ్లేషించి, ఏయే డివిజన్లలో ఏ వర్గాల ఓటర్లు బలంగా ఉన్నారో ముందే గుర్తించడం ద్వారా అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయాలని బీజేపీ భావిస్తోంది.
ఎస్ఐఆర్ ను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, అటు సంక్షేమంపై అధికార కాంగ్రెస్‌ను నిలదీస్తూనే, ఇటు క్షేత్రస్థాయి సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. జూన్ 25 నుంచి నెల రోజుల పాటు సాగనున్న ఈ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ పూర్తయ్యాక, గ్రేటర్ మున్సిపల్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి






