జాక్సన్విల్లేలో అత్యంత వైభవంగా జరిగిన ‘తాజా’ శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలు
TAJA: తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్లే ఏరియా (TAJA) ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది 2026’ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ వేడుకల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంతో పాల్గొని తమ ప్రతిభను చాటారు. వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సంగీత ప్రదర్శనలు తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ అలరించాయి.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వంటకాలు..
ఈ వేడుకల్లో ఆహూతులకు వడ్డించిన విందు భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మసాలా రెస్టారెంట్’ వారు అందించిన రుచికరమైన మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. అలాగే ‘దేశీ హ్యాంగౌట్’ వారి లైవ్ స్నాక్స్ కౌంటర్ వేడుకల్లో సందడి చేసింది. ముఖ్యంగా వేడివేడిగా, కరకరలాడే జిలేబీలను లైవ్‌లో తయారు చేసి వడ్డించడం అందరికీ సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
సరికొత్త రియల్-టైమ్ ఫోటో వీక్షణ..
రాజ్‌కమల్ ఫోటోగ్రఫీ , మీడియా టీం వారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా లైవ్-స్ట్రీమింగ్ చేయడమే కాకుండా, సరికొత్త రియల్-టైమ్ ఫోటో వీక్షణ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఈవెంట్లో దిగిన ఫోటోలను క్షణాల వ్యవధిలోనే ఆన్లైన్లో చూసుకునే వీలు కలిగింది. దీంతో పాటు నిర్వహించిన ‘రాఫిల్ గివ్అవేస్’ (లక్కీ డ్రా) విజేతలకు బహుమతులు అందించడం ఈవెంట్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం చేసిన కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు, స్పాన్సర్లకు, ప్రదర్శనకారులకు , ప్రతి తెలుగు కుటుంబానికి ‘తాజా’ (TAJA) బృందం తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రాజ్‌కమల్ ఫోటోగ్రఫీ వారి అధికారిక లింక్ ద్వారా వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.








