మీ ఏకఛత్రాధిపత్యం చాలు.. అమెరికాపై చైనా, రష్యా ఫైర్..!
అమెరికాకు చైనా, రష్యా గట్టి షాకిచ్చాయి. ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చలాయించడం మానుకోవాలని సూచించాయి. ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పుతిన్, జిన్‌పింగ్‌లిద్దరూ ‘బహుళ ధ్రువ ప్రపంచ ప్రకటన’పై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి, దాని ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీర్ఘకాలంపాటు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలూ ఉద్ఘాటించారు. బుధవారం పుతిన్‌కు బీజింగ్‌లో హార్దిక స్వాగతం పలికారు జిన్ పింగ్
బీజింగ్ లో పుతిన్ పర్యటన…
‘‘ప్రపంచ వ్యవహారాలను ఒంటిచేత్తో శాసించాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వారి ఇష్టాయిష్టాలను ప్రపంచంపై రుద్దాలని చూస్తున్నాయి. ఇతర దేశాల సార్వభౌమాధికారానికి అడ్డుపడాలని అనుకుంటున్నాయి’’ అని అగ్రనేతల ప్రకటన పేర్కొంది. పరస్పర గౌరవం, సమానత్వం, చక్కని విశ్వాసం, ఉభయులకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా-రష్యా అనుబంధం పెనవేసుకుందని గుర్తుచేసింది. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
బాధ్యతాయుతమైన గొప్పశక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, చరిత్ర గతిని వెనక్కుతిప్పేలా ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్‌పింగ్ ఆరోపించారు.. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని అన్నారు. ‘ఒకే చైనా’ అనే విధానానికి పుతిన్ మద్దతు ప్రకటించారు. చైనా నుంచి విడదీయరాని భాగమే తైవాన్ అని, దానికి స్వతంత్రతను ఏ రూపంలోనూ అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ప్రపంచ పాలన స్వరూపాన్ని మార్చాలని ప్రతిజ్ఞ చేస్తూ వాణిజ్యం, సాంకేతికత సహా వివిధ అంశాల్లో 20 ఒప్పందాలపై ఇరుపక్షాలూ సంతకాలు చేశాయి.
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు అక్రమమని, పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్ రక్షణ’ ప్రతిపాదనను ఈ ప్రకటన విమర్శించింది. అంతర్జాతీయ భద్రతపై తీవ్ర విపరిణామాలకు ఈ డోమ్ కారణమవుతుందని పేర్కొంది. నౌకల రాకపోకలకు ఆటంకాలు కల్పించడం ప్రపంచ వాణిజ్యానికి ముప్పు అని తెలిపింది. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్‌పింగ్ చెప్పారు. ప్రపంచ పాలన మరింత న్యాయబద్ధంగా, సముచితంగా ఉండేలా చైనా-రష్యా కలిసి పనిచేయాలని చెప్పారు. జిన్‌పింగ్ తన ప్రియమిత్రుడని పుతిన్ పేర్కొన్నారు. పాతికేళ్ల క్రితం కుదిరిన చైనా-రష్యా ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు ఇరువురూ అంగీకారం తెలిపారు.







