రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
Rupee fall: అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడిచమురు (క్రూడాయిల్) ధరలు, యూఎస్ బాండ్ యీల్డ్స్ (బాండ్లపై రాబడి) ఒత్తిడి కారణంగా భారత రూపాయి విలువ బుధవారం 96.84 వద్ద సరికొత్త ఆల్‌టైమ్ క్లోజింగ్ లోకి పడిపోయింది. వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి పతనం కొనసాగింది. ఇరాన్ యుద్ధం 12వ వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 111 డాలర్లను దాటడం స్థానిక కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఒక దశలో రూపాయి ఇంట్రాడేలో 96.3875 గరిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
మూడో ఏడాది కూడా ఆసియాలోనే బలహీనమైన కరెన్సీగా..
ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రూపాయి దాదాపు 7 శాతం నష్టపోయింది. గత సంవత్సర కాలంలో 12.5 శాతానికి పైగా క్షీణించిన రూపాయి, మే 2014 నుండి చూస్తే ఏకంగా 64.5 శాతం పతనమైంది. ఫలితంగా ఆసియాలోనే వరుసగా మూడో ఏడాది అత్యంత బలహీనమైన కరెన్సీగా రూపాయి నిలిచింది. గ్లోబల్ మార్కెట్లో వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఎక్కువగా కొనసాగుతాయనే అంచనాలు, పెరుగుతున్న వాణిజ్య లోటు (Trade deficit), కరిగిపోతున్న ఫారెక్స్ నిల్వల కారణంగా రూపాయి తీవ్ర ఎదురుగాలిని ఎదుర్కొంటోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ ఎనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా డాలర్ రూపంలో నిధులు వెలుపలికి పోవడంతో పాటు, ఎఫ్‌పిఐలు (FPIs) రూ. 2.2 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు.
కోలుకున్న స్టాక్ మార్కెట్లు..
మరోవైపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో అద్భుతమైన రికవరీని సాధించాయి. ఒక దశలో డేస్-లో (Day’s low) నుండి బిఎస్ఇ సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పుంజుకుని లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 77.05 పాయింట్లు (0.10%) లాభపడి 75,315.04 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 6.45 పాయింట్లు (0.03%) స్వల్ప లాభంతో 23,649.95 వద్ద ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో వాల్యూ బయ్యింగ్ (తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు) మార్కెట్ రికవరీకి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషించారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, బలహీనపడుతున్న రూపాయి వల్ల ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఉన్నప్పటికీ, ఎగుమతి ఆధారిత రంగాలలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా పెట్టుబడులు పెడుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.







