బ్రిటన్ను శాసిస్తున్న మనోళ్లు.. ఆ దేశ కుబేరుల్లో మళ్లీ ‘నంబర్ 1’
బ్రిటన్ గడ్డపై భారత సంతతి వ్యాపారవేత్తల ఆధిపత్యం మళ్లీ నిరూపితమైంది. ప్రతిష్టాత్మక ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ – 2026’ జాబితాలో మనోళ్లు మరోసారి సత్తా చాటారు. యూకేలోనే అత్యంత సంపన్న కుటుంబంగా భారతీయ మూలాలున్న ‘హిందూజా గ్రూప్’ (Hinduja Group) వరుసగా ఐదో సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
కళ్లు చెదిరే సంపద..
సండే టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. హిందూజా (Hinduja Group) కుటుంబం మొత్తం సంపద ఏకంగా 38 బిలియన్ యూరోలకు (భారత కరెన్సీలో సుమారు రూ. 4.26 లక్షల కోట్లు) చేరుకుంది. కుటుంబ పెద్ద గోపీచంద్ హిందూజా గతేడాది కన్నుమూసిన తర్వాత వెలువడిన తొలి ర్యాంకింగ్ ఇదే కావడం గమనార్హం. ఆయన మరణానంతరం ఈ విశాలమైన వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను ఆయన కుమారులు సంజయ్ హిందూజా, ధీరజ్ హిందూజాలు తమ భుజాలపై వేసుకుని అత్యంత విజయవంతంగా నడిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
దాదాపు 38 దేశాల్లో విస్తరించిన హిందూజా గ్రూప్.. మొబిలిటీ, బ్యాంకింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, డిజిటల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ వంటి అనేక కీలక రంగాల్లో బలంగా పాతుకుపోయింది. ఇందులో సంజయ్ హిందూజా (Hinduja Group) ‘గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్’ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ధీరజ్ హిందూజా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘అశోక్ లేలాండ్’ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆ రెండు కంపెనీలతో కాసుల వర్షం!
హిందూజా కుటుంబ (Hinduja Group) సంపద ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా రెండు కంపెనీలే కారణమయ్యాయి:
అశోక్ లేలాండ్ జోరు: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో.. గడిచిన ఏడాది కాలంలోనే అశోక్ లేలాండ్ షేర్లు ఏకంగా 40 శాతం ఎగబాకాయి.
బ్యాంకింగ్ బూస్ట్: దీనికి తోడు వారి గ్రూప్‌కే చెందిన ఇండస్ఇండ్ (IndusInd) బ్యాంక్ షేర్లు సైతం ఏడాదిలో 14 శాతం మేర వృద్ధి చెందడం వారి ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేసింది.
రెండో స్థానంలోనూ భారత సంతతి వారే..
ఈ రిచ్ లిస్ట్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదటి స్థానమే (Hinduja Group) కాదు, రెండో స్థానం కూడా భారత సంతతికి చెందిన రూబెన్ సోదరులకే దక్కడం. డేవిడ్ రూబెన్, సైమన్ రూబెన్ కుటుంబాల మొత్తం ఆస్తి 27.97 బిలియన్ యూరోలుగా (రూ. 3.13 లక్షల కోట్లు) నమోదైంది. లండన్‌లోని అత్యంత ఖరీదైన కేంబ్రిడ్జ్ హౌస్, అడ్మిరల్టీ ఆర్చ్ వంటి చారిత్రక భవనాలను లగ్జరీ హాస్పిటాలిటీ ప్రాజెక్టులుగా మారుస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని వీరు శాసిస్తున్నారు. ఇదే జాబితాలో మన దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ లోహియా 28వ స్థానంలో నిలవగా.. వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ మాత్రం ఈసారి 43వ స్థానానికి పడిపోవడం గమనార్హం. మొత్తానికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో భారతీయుల పాత్ర ఎంత కీలకమో ఈ రిచ్ లిస్ట్ మరోసారి నిరూపించింది.
ఇవి కూడా చదవండి







