పాదయాత్ర చేసే నైతికహక్కు వారికి లేదు :మంత్రి జూపల్లి
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పాదయాత్ర చేసే నైతిక హక్కు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నవాళ్లు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పంపులు, మోటార్లు, సర్జ్పూల్కు రూ.35 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ హయాంలో రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే, బీఆర్ఎస్ హయాంలో రూ.6300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ స్థాయి రిజర్వాయర్ ను మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని కలిసి పాలమూరు జిల్లాకు అత్యధికంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి లో మోటార్ ఆన్ చేయగానే నీళ్లు వస్తాయంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలివి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తమకు హామీ ఇచ్చారని, లక్ష్మీదేవిపల్లి గుట్టకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పారని వెల్లడించారు.







