ఇరాన్లో రికార్డు స్థాయిలో మరణశిక్షలు.. ఆమ్నెస్టీ షాకింగ్ రిపోర్ట్
Iran: ఇరాన్లో గతేడాది రికార్డు స్థాయిలో 2,150 కంటే ఎక్కువ మందికి మరణశిక్షలు అమలు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. 1981 తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా మరణశిక్షలు నమోదైన సంవత్సరంగా గతేడాది నిలిచిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సోమవారం ప్రకటించింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించిన మొత్తం 2,707 మరణశిక్షలలో, ఒక్క ఇరాన్‌లోనే 2,159 శిక్షలు అమలు కావడం గమనార్హం. ఇది 2024 నాటి గణాంకాల కంటే రెండింతలు ఎక్కువని, అయితే వేలాది మందికి మరణశిక్షలు అమలు చేస్తున్నట్లు భావిస్తున్న చైనా వివరాలు ఈ అధికారిక లెక్కల్లో చేరలేదని ఆమ్నెస్టీ స్పష్టం చేసింది.
ఇరాన్ తర్వాత స్థానాల్లో ఉన్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ తర్వాత అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసిన దేశాల జాబితాలో సౌదీ అరేబియా ముందంజలో ఉంది. ఆ దేశంలో అత్యధికంగా 356 మరణశిక్షలు అమలు కాగా, యెమెన్‌లో 51, అమెరికా (US) లో 47, ఈజిప్ట్‌లో 23 శిక్షలు అమలయ్యాయి. ఇక కువైట్, సింగపూర్ దేశాలు చెరి 17 మరణశిక్షలతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇరాన్లో భారీగా అరెస్టులు..
ఇదిలావుండగా, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన ఆరోపణలపై ఇరాన్ అధికారులు దేశంలో భారీ అణిచివేత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ఆరోపణలపై 4,000 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసినట్లు అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుండి మే 5 మధ్య కాలంలోనే కనీసం 4,023 అరెస్టులను తాము అధికారికంగా డాక్యుమెంట్ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఇవి కూడా చదవండి







