బీఆర్ఎస్ – బీజేపీ దోస్తీ ప్రచారానికి చెక్! ఇక రణమే..!!
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలున్నాయి. అయితే బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య తెరవెనుక పొత్తు ఉందని చెప్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఊహాగానాలకు తెరపడింది. బండి భగీరథ్ కేసు వ్యవహారం ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచేసింది. భగీరథ్‌పై నమోదైన కేసు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో పొత్తుల సమీకరణాలను మార్చేసినట్లు అర్థమవుతోంది. ఢిల్లీ పెద్దలపై ఈగ వాలనివ్వకుండా కేవలం రాష్ట్ర స్థాయి నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్న గులాబీ బాసులు.. ఒక్కసారిగా రూట్ మార్చారు. తాజా పరిణామాలతో తెలంగాణ పీఠం కోసం పక్కాగా త్రిముఖ పోరు ఖాయమనే విషయం స్పష్టమైంది.
బండి భగీరథ్ ఉదంతాన్ని ఒక సాధారణ లీగల్ ఇష్యూగా వదిలేయడానికి బీఆర్ఎస్ అస్సలు సిద్ధపడలేదు. దొరికిన అస్త్రాన్ని పదునుపెట్టి కమలనాథుల గుండెల్లో దింపింది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలంటూ స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగడం, రాష్ట్రవ్యాప్తంగా గులాబీ కేడర్ రోడ్లపైకి వచ్చి నిరసనలతో హోరెత్తించడం చూసి బీజేపీ మైండ్ బ్లాంక్ అయింది. తమతో సయోధ్య, గియోధ్య లాంటి ముచ్చట్లేవీ లేవని, అవకాశం దొరికితే చట్టపరమైన ఉచ్చులతో రాజకీయ సమాధి కట్టడానికి బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందనే చేదు నిజం ఢిల్లీ పెద్దలకు ఈ దెబ్బతో అర్థమైంది.
ఈ దెబ్బతో బీజేపీ అధిష్టానం తన సాఫ్ట్ కార్నర్ వ్యూహాన్ని చెత్తబుట్టలో పారేసింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్ల ప్రదర్శిస్తూ వచ్చిన వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలని ఢిల్లీ బాసులు డిసైడ్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న కమలదళం.. తన నెక్స్ట్ మెయిన్ టార్గెట్‌గా తెలంగాణను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రత్యర్థులను తుడిచిపెట్టే అగ్రెసివ్ పాలిటిక్స్‌కు తెరలేపింది. బీఆర్ఎస్ వేసిన రివర్స్ గేర్ కమలనాథులను మరింత రెచ్చగొట్టడంతో.. ఇక గులాబీ పార్టీని క్షేత్రస్థాయిలో నామరూపాలు లేకుండా చేయడమే ఏకైక ఎజెండాగా బీజేపీ తన అసలైన రాజకీయ వేట ప్రారంభించబోతున్నట్టు సమాచారం. బండి భగీరథ్ పోక్సో కేసు సెగలు కాస్త చల్లబడటమే ఆలస్యం.. బీఆర్ఎస్ పై బీజేపీ ప్లాన్ అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తానికి బండి భగీరథ కేసు కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా మిగిలిపోలేదు. తెలంగాణ భవిష్యత్తు పొత్తుల పటాన్ని, పొలిటికల్ రూట్ మ్యాప్‌ను మార్చేసిన ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇకపై ఎలాంటి లోపాయికారీ పొత్తులకు ఛాన్స్ ఉండకపోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒంటరిగానే రణరంగంలోకి దూకడం పక్కాగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి







