యుద్ధ భయాలతో కుప్పకూలనున్న స్టాక్ మార్కెట్లు?
పశ్చిమాసియాలో భగ్గుమంటున్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక మార్కెట్లను వణికిస్తోంది. యుద్ధం ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందో అన్న భయంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి గడ్డు కాలంలో దలాల్ స్ట్రీట్ (Stock Market) పరిస్థితి ఏంటి? మన మార్కెట్లు కూడా కుప్పకూలతాయా? అన్న భయాందోళనల మధ్య సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన చేశారు. తాజాగా జరిగిన దేశీయ పెట్టుబడిదారుల అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపేలా మార్కెట్ ముఖచిత్రాన్ని విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
అసలు ముప్పు ఎక్కడంటే..
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉన్నాయని పాండే గుర్తుచేశారు. కాబట్టి పశ్చిమాసియాలో సంక్షోభం తలెత్తితే, ఆ ప్రకంపనలు మిగతా దేశాలను తాకడం సహజమేనన్నారు. ముఖ్యంగా ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, ఫలితంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల మంట ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని, మనలాంటి ముడి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాలే (Stock Market) అని ఆయన స్పష్టం చేశారు.
భయపడాల్సిన పనిలేదు..
అంతర్జాతీయంగా ఎన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) మాత్రం ఈ గ్లోబల్ షాక్స్ను తట్టుకుని నిలబడేంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సెబీ చైర్మన్ చెప్పారు. గ్లోబల్ టెన్షన్స్ దెబ్బకు మార్కెట్లలో తాత్కాలికంగా ఆటుపోట్లు రావడం సహజమేనని, కానీ ఆ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే మన మార్కెట్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆ ‘సూపర్ పవర్’ ఏంటి?
ఒకప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మన దలాల్ స్ట్రీట్ రక్తమోడేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల (సామాన్య పెట్టుబడిదారులు) మద్దతు విపరీతంగా పెరిగింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIPs) రూపంలో ప్రతి నెలా వస్తున్న భారీ దేశీయ పెట్టుబడులు మన మార్కెట్లకు (Stock Market) కొండంత అండగా నిలుస్తూ షాక్ అబ్జార్బర్లా పనిచేస్తున్నాయి. దీనికి తోడు మన దేశ అత్యుత్తమ నియంత్రణ వ్యవస్థల (Regulatory Systems) సమర్థత వల్ల గ్లోబల్ షాక్స్ను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయికి మన మార్కెట్ ఎదిగిందని ఆర్థిక విశ్లేషకులు సైతం ఏకీభవిస్తున్నారు.
ఇవి కూడా చదవండి







