ట్రంప్ నకు సెనెట్ లో ఎదురుదెబ్బ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు సెనెట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన దూకుడు ప్రవర్తనకు అమెరికా సెనెట్ (USA Senate) కళ్లెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి తాజాగా ఆమోదం లభించింది.
ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ..ఇరాన్ (Iran)పై యుద్ధానికి దిగారు. యుద్ధంపై ట్రంప్ అధికారాలను పరిమితం చేసేందుకు డెమోక్రట్లు అనేకసార్లు సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. అయితే, వారి తీర్మానాలకు తగినంత ఓటింగ్ లభించలేదు. డెమోక్రటిక్ సెనెటర్ టిమ్ కెయిన్ తాజాగా మరోసారి సెనెట్ ముందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యుద్ధ ప్రకటన, సైనిక చర్యకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప.. ఇరాన్ లోపల లేదా దానికి వ్యతిరేకంగా జరిగే ఘర్షణల్లో యూఎస్ దళాలు పాల్గొనకూడదని అందులో తెలిపారు. దీనికి 50 మంది అనుకూలంగా.. 47 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఈ తీర్మానం ఆమోదంలో నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతుగా ఓటు వేయడం గమనార్హం. కాగా.. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి త్వరలో తుది ఓటింగ్ జరగనుంది. ఇది చట్టంగా మారితే.. కాంగ్రెస్ అధికారికంగా సైనిక దాడి కొనసాగించడానికి అనుమతి ఇచ్చేవరకు ట్రంప్ ఇరాన్‌పై ఎలాంటి దాడులకు దిగకూడదు.
యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలపై కాంగ్రెస్ తిరిగి పర్యవేక్షణ చేపట్టాలన్నారు డెమోక్రటిక్ సెనెటర్ చక్ షుమర్.. ‘ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిలా ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి







