కొరియర్ల పేరిట సైబర్ నేరగాళ్ల కొత్త రూట్
Cyber Crime: ఆన్లైన్ షాపర్లే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో విరుచుకుపడుతున్నారు. ఓటీపీలు చెప్పడం, లింకులు క్లిక్ చేయడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం కొరియర్ డెలివరీల పేరిట, కాల్ ఫార్వర్డింగ్ కోడ్ల ద్వారా , ఉచితంగా ఫోన్లు పంపిస్తూ ప్రజల సొమ్మును దోచేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డెలివరీ పేరిట కాల్ ఫార్వర్డింగ్ మోసాలు..
నేరగాళ్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల డెలివరీ బాయ్స్‌గా లేదా ప్రైవేటు కొరియర్ కంపెనీల ప్రతినిధులుగా ఫోన్ చేస్తారు. బాధితుల పేరు, చిరునామా ముందే సేకరించి, వాటిని సరిచూసుకుంటూ నమ్మిస్తారు. మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చిందని, ఎలాంటి బుకింగ్ చేయలేదని చెబితే పొరపాటున వచ్చి ఉండొచ్చని నమ్మిస్తారు. ఆ ఆర్డర్‌ను రద్దు చేయడానికి లేదా చిరునామా ధృవీకరణ కోసం ఫోన్లో *21* ఫోన్ నంబరు హ్యాష్ (#) డయల్ చేయాలని కోరతారు. అలా డయల్ చేయగానే బాధితుల ఫోన్‌కు వచ్చే కాల్స్, ఓటీపీలు, వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్లు పూర్తిగా సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అయిపోతాయి. దీనిని ఆసరాగా చేసుకుని బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును కాజేస్తున్నారు.
ఇంటికే నేరుగా కొరియర్..
టెలికాం శాఖ (డీవోటీ) లేదా వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డు విభాగం ప్రతినిధులమంటూ ఫోన్ చేసి, సిమ్ కార్డు తనిఖీ చేసుకోకపోతే సేవలు నిలిచిపోతాయని బెదిరిస్తారు. తనిఖీ కోసం అడిగితే నేరుగా ఇంటికే కొరియర్ ద్వారా ఒక ఫోన్‌ను పంపిస్తారు. ఆ ఫోన్లలో ముందస్తుగానే ప్రమాదకరమైన మాల్వేర్ను ఇన్స్టాల్ చేసి ఉంచుతారు. బాధితులు ఆ ఫోన్లలో తమ సిమ్ కార్డు వేయగానే బ్యాంకింగ్ ఓటీపీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. ఇలా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఢిల్లీ నుండి వచ్చిన ఒక ఫోన్లో సిమ్ కార్డు వేయగానే ఒక బాధితుడు ఏకంగా 77 లక్షల రూపాయలు కోల్పోవడం గమనార్హం.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సూచనలు..
మనం బుక్ చేయకుండా కొరియర్ ద్వారా ఏదైనా వస్తువు లేదా ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ స్పష్టం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లలో బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని, ఆర్డర్ లేదా తనిఖీల పేరిట వచ్చే అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.







