ఒకే ఒక్క వార్త.. తమిళనాడు రాజకీయాలను షేక్ చేసింది…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి ఇప్పుడే తల నొప్పులు ప్రారంభమయ్యాయి. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకుంటారంటూ పుకార్లు బయల్దేరాయి. దీంతో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. నిజానికి ప్రభుత్వం కొనసాగడంలో కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలతో పాటు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా వుంది.
అయితే.. ఈ రెబల్ నేతలకు కేబినెట్ బెర్తులు కేటాయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వీసీకే తీవ్రంగా స్పందించింది. ఆ ఎమ్మెల్యేలకు గనక కేబినెట్ బెర్తులు కేటాయిస్తే, తమ మద్దతు అంశంపై పునరాలోచించుకుంటామని, ఉపసంహరణకు కూడా వెనకాడమని హెచ్చరించారు. వీసీకేనే కాదు.. వామపక్షాలు కూడా ఇలాగే స్పందించింది. అన్నాడీఎంకేలోని ఏ వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకున్నా, ప్రజల తీర్పునకు అది విరుద్ధమే అవుతుందని పేర్కొంది.
దీంతో ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఇరకాటంలో పడిపోయారు. ఎందుకంటే ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్.. కార్యకర్తలతో మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని ప్రకటించారు. అంతలోనే.. రెబెల్స్ కి టిక్కెట్లు ఇస్తున్నారన్న వార్త చక్కర్లు కొట్టింది.
అయితే.. విజయ్ వెంటనే అప్రమత్తమయ్యారు. తమిళనాడు మంత్రి అధవ్ అర్జున స్పందించారు. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కేబినెట్ లో చేరతారనే వార్తలు కేవలం ఊహాగానాలేనని తెలిపారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను క్యాబినెట్లోకి తీసుకోవడం లేదని తనకు సమాచారం అందినట్టు చెప్పారు. దీంతో టీవీకే ప్రభుత్వంలో తమ పార్టీ చేరనుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారు.







