రాజకీయ విమర్శలు కాదు.. నిర్మాణాత్మక సూచనలు.. వీడీ సతీశన్ స్టైల్ ఇదే..
వీడీ సతీశన్… కేరళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అన్ని ఆటంకాలు దాటి, 20 మందితో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే.. సతీశన్ రాజకీయ స్టైల్ చాలా భిన్నంగా వుంటుంది. ఎప్పుడూ రాజకీయ ప్రచారాలు, రాజకీయ విమర్శలే చేసే అలవాటు వారికి లేదు. విమర్శలు కాకుండా, నిర్మాణాత్మక సలహాలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశాలు, సలహాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా వుంటారు. దీని ద్వారా విద్యావంతులను కూడా ఆకర్షిస్తున్నారు.
వీడీ సతీశన్ కేరళ రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగిన నేత. అత్యంత నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలను నమ్ముతుంటారు. ఎర్నాకులంలో పుట్టి పెరిగి, సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా కూడా చేసి, చివరకు రాజకీయ నేత అయ్యారు. అన్నింటి కంటే ముందు విద్యార్థి సంఘంలో కూడా చేశారు.
2001 లో మొదటి సారిగా ఎర్నాకుళం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, విజయం సాధించారు. అప్పటి నుంచి 2006,2011,2016,2021 తో పాటు తాజా ఎన్నికల్లో కూడా ఘన విజయాలే సాధించుకుంటూ వస్తున్నారు. వరుసగా ఆరుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పట్ల చాలా పట్టుంది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడతారన్న పేరుంది.
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో సతీశనే కీలక పాత్ర. ‘‘మిషన్ 100’’ కి శ్రీకారం చుట్టింది ఈయనే. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలతో పాటు పలువురు నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యామ్నాయ పాలన ఎలా వుంటుందో చూపించారు. అలాగే తన యాత్ర సందర్భంగా కూడా భవిష్యత్ ప్రాజెక్టులను ఎలా చేపడతానో వివరించేవారు. రాజకీయాలు చాలా తక్కువగా మాట్లాడేవారు. ఇదే ప్రజలను బాగా ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి






