ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవానికి హాజరైన సీఎం చంద్రబాబు
సనాతన ధర్మానికి-ఆధునిక ప్రపంచానికి వారధి ఆర్ట్ ఆఫ్ లివింగ్
చంద్రబాబు దేశానికి ఐటీ మ్యాన్- శ్రీ రవిశంకర్ గురూజీ
బెంగుళూరు, మే 20: సనాతన ధర్మానికి- ఆధునిక ప్రపంచానికి వారధిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మానసిక ఒత్తిడిలేని సమాజం- ప్రపంచ శాంతి లక్ష్యంగా ఆ సంస్థ నాలుగు దశాబ్దాలుగా సేవలు అందిస్తోందని అన్నారు. బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవానికి సీఎం హాజరయ్యారు. శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా మానవాళి శ్రేయస్సు, శాంతి సౌఖ్యాల కోసం పనిచేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శ్రీ రవిశంకర్ గురూజీ కేవలం ఆధ్యాత్మిక బోధనలతో పాటు శాంతి సామరస్యాలను చాటిచెప్పే ప్రపంచ మానవుడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హింస లేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే లక్ష్యాన్ని సాధించాలని ఆయన దశాబ్దాలుగా మానవాళికి గొప్ప సేవ చేస్తున్నారని అన్నారు. యుద్ధాలతో శాంతికి దూరమైన సమాజాన్ని అనిశ్చితి నుంచి బయట పడేసేలా మానవత్వమే అత్యుత్తమ మార్గంగా ఆయన ఎంచుకున్నారని అన్నారు. ట్రాన్స్ఫర్మేటివ్ పవర్, డైలాగ్, ఇన్నర్ స్ట్రెంత్ వంటి విధానాల ద్వారా గ్రామాల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకూ, కొలంబియా వంటి సంఘర్షణ ప్రాంతాల వరకూ చర్చల మార్గంలో మార్పులు తెచ్చారని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలతో పాటు అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకున్న ఆధ్యాత్మిక వేత్తగా శ్రీరవిశంకర్ గురూజీ నిలిచారన్నారు.

ఏపీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు
45 ఏళ్ల క్రితం హ్యాపీ హ్యూమన్ బీయింగ్, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ, బెటర్ వరల్డ్ అనే విజన్‌తో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిందని ముఖ్యమంత్రి అభినందించారు. సురక్షిత తాగునీరు, రివర్ రిజువనేషన్, మహిళా స్వయం సమృద్ధి, విలువలతో కూడిన విద్య వంటి రంగాల్లో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు రోజువారీ జీవితంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని…భౌగోళిక రాజకీయ పరిస్థితులు సామాన్య ప్రజల జీవితాలను కూడా తీవ్ర ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయని తెలిపారు.
గ్యాస్, ఇంధనం వంటి వనరుల లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోందని.. ఈ నేపథ్యంలో ఒత్తిడిని ఎదుర్కొని సమర్ధంగా జీవించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు మానవాళికి అత్యుత్తమ సేవలు అందించాలని ఆయన కోరారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన నేల ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం, ఆహోబిలం, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలిగి ఉందని.. ఈ ఆధ్యాత్మికతను మరింత విస్తృతం చేసేలా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. మరోవైపు దేశానికి ఐటీ మ్యాన్ గా చంద్రబాబు సేవలకు కొలమానం లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఐటీ నిపుణులుగా తెలుగు ప్రజలు కనిపిస్తారని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ మేటి నగరంగా ఎదగటంలో సీఎం చంద్రబాబు పాత్ర కీలకమని శ్రీరవిశంకర్ గురూజీ వ్యాఖ్యానించారు.
ఆర్ధిక ప్రగతి-ఆనందకరమైన జీవనం
ఆభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక ప్రగతి, సాంకేతికత మాత్రమే కాదని.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమేనని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ప్రతి పౌరుడూ శాంతి సౌఖ్యాలు, ఆనందంతో జీవించాలన్నది తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంత అభివృద్ధి సాధించినా ప్రజల్లో శాంతి సౌఖ్యాలు రావాలంటే ఆధ్యాత్మికత అత్యవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పనిచేయాలని సీఎం కోరారు. అందుకే పీ4 వంటి కార్యక్రమాలు చేపట్టి, స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను అమలు చేస్తున్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ నిర్మాణమే తన సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం శ్రీరవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో కొద్దిసేపు ధ్యాన ప్రక్రియలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మంత్రులు, మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తదితరులు హాజరయ్యారు.







