వాట్సాప్‌లోనే జీహెచ్ఎంసీ 9 పౌర సేవలు.. ఎలా పొందాలంటే?
GHMC: హైదరాబాద్‌లోని పౌర సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు ‘మీసేవా’ సంస్థ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. జీహెచ్ఎంసీకి సంబంధించిన 9 రకాల పౌర సేవలను ఇకపై ‘వాట్సాప్ మీసేవా’ , ‘చాట్‌బాట్’ ద్వారా పొందవచ్చని ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నూతన సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు.
గతేడాది నవంబరు 18న ప్రారంభమైన ఈ వాట్సాప్, చాట్‌బాట్ సేవల ద్వారా ప్రజలు మీసేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా తమ పనులను పూర్తి చేసుకోవచ్చు.
అందుబాటులోకి వచ్చిన 9 ముఖ్యమైన సేవలు..
జీహెచ్ఎంసీ పరిధిలోని పౌరుల సౌకర్యార్థం వాట్సాప్ , చాట్‌బాట్ ద్వారా మొత్తం 9 రకాల ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆస్తిపన్ను సవరణ (Property Tax Correction), జనన ధ్రువపత్రాల సవరణ (Birth Certificate Correction), మరణ ధ్రువపత్రాల సవరణ (Death Certificate Correction) వంటి సేవలను ఇంటి నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంటి వద్ద జననం (Home Birth) నమోదు, ఇంటి వద్ద మరణం (Home Death) నమోదు, ఇంటి నంబరు సవరణ (House Number Correction) చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. అలాగే ఆస్తుల బదిలీకి సంబంధించిన మ్యుటేషన్ (Mutation) ప్రక్రియ , వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ (Trade License Renewal) సేవలను కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా సులువుగా పొందవచ్చు.
సేవలను పొందే విధానం..
- మొదటగా మీ మొబైల్లో 80969 58096 ఫోన్ నంబరును ‘మీసేవ తెలంగాణ’ అనే పేరుతో సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్‌లో ఆ నంబరుకు ‘హాయ్’ (Hi) అని మెసేజ్ పంపాలి.
- మీకు కావలసిన సేవ పేరును టైప్ చేసి, మెనూలో కనిపించే ‘ఓపెన్ సర్వీస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- వెంటనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన వివరాలను నింపి, దరఖాస్తు రుసుము చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
- ప్రత్యామ్నాయంగా, మీసేవ వెబ్‌సైట్‌లోని చాట్‌బాట్‌ను ఉపయోగించి కూడా ఈ సేవలను పొందవచ్చు.
ప్రస్తుతం ఈ నూతన విధానానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా జనన ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, ట్రాఫిక్ చలానా, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి సేవలను ప్రజలు ఈ చాట్‌బాట్ ద్వారా ఎక్కువగా పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.







