మెలోడీ వాణిజ్య గీతం..!
భారత ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని మెలోనీ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రపంచానికంతటికీ తెలిసిందే. ఎందుకంటే వీరిద్దరి సాన్నిహిత్యాన్ని గుర్తించిన ప్రపంచం… ముద్దుగా ఈజంట నేతలను మెలోడీగా పిలుచుకుంటోంది. ఇటలీలో పర్యటన సందర్భంగా మళ్లీ మెలోడీ .. ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ప్రధాని మోడీ.. మెలోనీకి మెలోడి చాక్ లెట్లు బహూకరించారు. దీన్ని ఇద్దరు నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తనకు ‘మెలోడీ టోఫీల’ను బహుమతిగా ఇచ్చిన మోడీకి మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు.‘ప్రధాని మోడీ నాకు బహుమతిని తీసుకొచ్చారు. అది ఎంతో ప్రత్యేకమైన, మంచి బహుమతి. దానిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని మెలోనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె పోస్టు చేసిన వీడియోలో మోడీ నవ్వులు చిందిస్తూ కనిపించారు.
మెలోడీ గిఫ్ట్ వీడియోకు గంటల్లోనే 12 కోట్ల వ్యూస్
మెలోనీకి మెలోడీ టోఫీని బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ వీడియోకు గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో 12 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక్క ఎక్స్‌లోనే 74 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.
ఇవి కూడా చదవండి
మంగళవారం రాత్రి రోమ్ చేరుకున్న మోడీకి తొలుత సైనిక వందనం లభించింది. ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతించారు. కథక్, కూచిపూడి, భరత నాట్యాన్ని ఇటలీ కళాకారులు ప్రదర్శించారు. భారతీయ సంగీతానికి సంబంధించిన హంసధ్వని, సితార్, సంతూర్, బన్సూరీ, తబలాలతో ఇటలీ కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలను మోడీ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇటలీ ప్రధాని మెలోనీ ఆయనకు విందు ఇచ్చారు. ఇరువురు నేతలు కలిసి చారిత్రక కలోసియంను సందర్శించారు. అక్కడ మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తనను వారణాసిలో కలిసిన ఇటలీ పెయింటర్ జాంపౌలో తొమసెటీని ప్రధాని మోడీ కలిశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన భారతీయ సంస్కృతిపట్ల తన అభిమానాన్ని చూపుతున్నారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.
ఇటీవలి కాలంలో భారత్, ఇటలీ మధ్య వాణిజ్యం భారీగా పెరిగింది. 2025లో 14.25 బిలియన్ యూరోల వాణిజ్యం జరిగింది. దీనిని 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2025 జనవరి నాటికి ఇటలీలో 1,86,833 మంది భారతీయులున్నారు. ప్రస్తుతం 5,100 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు.
ఆహార భద్రత, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిలో సుస్థిరతకు కృషి చేసినందుకు ప్రధాని మోడీకి అగ్రికోలా మెడల్‌ను ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) బహూకరించింది. రోమ్‌లోని ఎఫ్ఏవో ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును మోడీకి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కు డోంగ్యు అందజేశారు. ఆహార భద్రతలో భారత్ కృషికి దక్కిన గౌరవమిదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి







