ఇటలీ భారత్ బంధం మరింత బలోపేతం..!
భారత్, ఇటలీలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించాయి. అదేవిధంగా వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi).. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు నిర్వహించారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
మెలోనీ నాయకత్వంలో భారత్- ఇటలీ సంబంధాలకు కొత్త దిశ లభించిందని ప్రధాని మోడీ అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.1.93 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. షిప్పింగ్, పోర్టుల ఆధునికీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీ రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. భారత్- ఇటలీ రక్షణ పారిశ్రామిక ప్రణాళిక.. సైనిక పరికరాల అభివృద్ధి, ఉత్పత్తికి మార్గం సుగమం చేసిందన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాయని తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు.
గౌరవం, పరస్పర విశ్వాసం ఆధారంగా ఇరు దేశాల మధ్య స్నేహం ఏర్పడిందని మెలోనీ అన్నారు. అనేక సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ.. పౌరుల్లో ప్రజాదరణను కలిగి ఉన్నారని ప్రధాని మోడీని ప్రశంసించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ ఉండటం ముఖ్యమని చెప్పారు. అంతకుముందు ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాతో మోడీ భేటీ అయ్యారు. కృత్రిమ మేధ, అణుశక్తి, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక సంబంధాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి







