ఇరాన్ పై మరోసారి సైనిక చర్య వద్దు.. ట్రంప్ నకు పుతిన్ వార్నింగ్..!
అమెరికా-ఇరాన్ వార్ విషయంలో ఇన్నాళ్లు టెహ్రాన్ కు తెరచాటు సాయం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇప్పుడు నేరుగా ట్రంప్ కే వార్నింగిచ్చారు. టెహ్రాన్‌పై మళ్లీ సైనిక చర్యకు దిగితే.. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరుదేశాల నేతలు 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు.
ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ (Vladimir Putin) స్వాగతించారని ఉషాకోవ్ తెలిపారు. ఈ చర్యతో దౌత్య చర్చలకు మార్గం సుగమమవుతుందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా- ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ (Iran)పై దాడులకు దిగితే.. పశ్చిమాసియాతో సహా మొత్తం అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరించినట్లు వెల్లడించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు ముగించేందుకు సాధ్యమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పునరుద్ఘాటించారన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితులను గురించి ఇరుదేశాల నేతలు చర్చించుకున్నట్లు తెలిపారు.
పుతిన్‌తో సంభాషణలో ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (Enriched Uranium) నిల్వల గురించి మాట్లాడుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే, ‘మీరు నాకు సహాయం చేసే ముందు, నేను మీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాను’ అని తాను బదులిచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఉక్రెయిన్ (Ukraine)లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణను సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని ట్రంప్ తెలిపారు.
ఇవి కూడా చదవండి







