Trump: రష్యా-ఉక్రెయిన్ వార్ ముగిసేనా..? ట్రంప్ శాంతి ప్రయత్నాలు ఫలిస్తాయా..?
అధికారంలోకి వస్తే ఏడాదిలోనే యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ట్రంప్… ఇప్పుడా విషయంలో గట్టిపట్టుదలగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పుతిన్ , మరోవైపు జెలెన్ స్కీ.. మధ్యలో యూరోపియన్ అధినేతలతో చర్చల పరంపర కొనసాగిస్తున్నారు. అయితే పుతిన్ తాను అనుకున్నది .. అనుకున్నట్లు సాగితేనే, చర్చలంటున్నారు. తమ భూభాగం, ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి వస్తే.. కుదరదని తెగేసి చెబుతున్నారు జెలెన్ స్కీ. దీంతో శాంతి ప్రయత్నాలు.. ట్రంప్ నకు కత్తిమీద సాములా మారాయని చెప్పవచ్చు.
ఏ యుద్ధం పరిష్కారం కావాలన్నా అదినేతలు ఓ ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది పరస్పర నమ్మకం, విశ్వాసం. ఇద్దరు నేతలు..యుద్ధరంగంలో ఆరితేరారు. దీంతో ఎవరూ, మరొకరిని నమ్మడం లేదు. చర్చల ద్వారా ఫలితం కావాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పష్టం చేశారు. పుతిన్, జెలెన్ స్కీ… పరస్పరం ద్వేషించుకుంటున్నారని.. అందుకే చర్చలు ముందుకు సాగడం కష్టంగా మారుతోందన్నారు.
మేము ఒక పరిష్కారానికి చాలా దగ్గరగా ఉన్నామని భావిస్తున్నామన్నారు ట్రంప్. యుద్ధం ముగింపునకు మంచి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. తీవ్రమైన శీతాకాల పరిస్థితుల వల్ల ఉక్రెయిన్ (Ukraine) రాజధాని కీవ్, ఇతర నగరాలపై దాడులను తాత్కాలికంగా ఆపేయాలని పుతిన్ను కోరినట్లు ట్రంప్ (Donald Trump) ఇటీవల తెలిపారు.దానికి రష్యా (Russia) అంగీకరించిందని కూడా వెల్లడించారు.
ఇదిలాఉండగా.. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ముగించే లక్ష్యంలో భాగంగా రష్యా .. జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించింది. పుతిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ మాట్లాడుతూ.. జెలెన్స్కీ సమావేశానికి అంగీకరిస్తే మాస్కోలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. ఆయన భద్రతకు రష్యా హామీ ఇస్తుందని అన్నారు.






