KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రేపు సిట్ (SIT) విచారణకు ఫిబ్రవరి1న హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా సాగుతున్న దర్యాప్తులో భాగంగా అధికారులు కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం, దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ విచారణకు వెళ్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
కేసీఆర్ను విచారణకు పిలవడంపై బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర కీలక నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలని పార్టీ క్యాడర్ను కోరింది.
తెలంగాణ భవన్కు భారీగా తరలిరావాలని ఆదేశం
కేసీఆర్ విచారణకు వెళ్తున్న సమయంలో తమ సంఘీభావాన్ని చాటడానికి వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాల నుండి భారీగా బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో గులాబీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా బంజారాహిల్స్, సిట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఉత్కంఠగా రేపటి పరిణామాలు
విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు? కేసీఆర్ వారి ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఈ విచారణను అడ్డుకునేందుకు లేదా నిరసనలు ఉధృతం చేసేందుకు బిఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతుండటంతో పోలీసులు శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏదేమైనా రేపటి కేసీఆర్ ‘సిట్’ విచారణ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మిగిలిపోయేలా కనిపిస్తోంది.






