KCR : రేపు కేసీఆర్ సారొస్తారా.. రారా..?
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ చుట్టూ సాగుతున్న హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. ఒకవైపు సిట్ (SIT) పట్టుదల, మరోవైపు గులాబీ బాస్ వ్యూహ ప్రతివ్యూహాలతో ఈ వ్యవహారం ఇప్పుడు నువ్వా-నేనా అనే స్థాయికి చేరింది. “రేపు కేసీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా?” అనే దానిపైనే ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా సిట్ అధికారులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరుగుతున్న నోటీసుల యుద్ధం ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తొలుత సానుకూలంగా స్పందించినట్టు కనిపించిన సిట్, ఒక్కసారిగా తన పంథాను మార్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ డ్రామా అంతా ‘అడ్రస్’ చుట్టూనే తిరుగుతోంది. విచారణకు ఎక్కడైనా సిద్ధమని తొలుత చెప్పిన సిట్, ఇప్పుడు కేవలం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికే పరిమితమవ్వడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ తన అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఇచ్చారని, చట్టపరంగా అక్కడే విచారించాలని సిట్ వాదిస్తోంది.
అయితే, దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబడుతోంది. “హరీశ్ రావు అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉన్నప్పుడు, ఆయనకు హైదరాబాద్‌లో నోటీసులు ఎలా ఇచ్చారు?” అని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. అంతేకాక అర్ధరాత్రి హడావిడిగా వచ్చి గోడకు నోటీసులు అంటించడాన్ని కూడా బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. గోడకు నోటీసులు అంటించడం సుప్రీంకోర్టు రూల్స్ కు విరుద్ధమని వాదిస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మకాం వేశారు. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాతే విచారణకు రావాలని ఆయన సిట్‌కు బదులిచ్చారు. కానీ, సిట్ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీనే నందినగర్‌లో విచారణకు రావాలని డెడ్ లైన్ విధించింది. ఈ ప్రతిష్టంభన చూస్తుంటే, ప్రభుత్వం కేసీఆర్‌ను ఎలాగైనా విచారణ గదిలోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రస్తుతం ఎర్రవల్లి ఫాంహౌస్ రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం పుష్కలంగా ఉంది. విచారణ గడువు కోరడం లేదా వేదిక మార్పుపై స్టే కోరడం బీఆర్ఎస్ ముందున్న ప్రాథమిక మార్గం. ఈ విచారణను రాజకీయ వేధింపుగా ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సానుభూతి పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
సిట్ పంపిన తాజా నోటీసుతో బంతి ఇప్పుడు కేసీఆర్ కోర్టులో ఉంది. రేపు ఆయన నందినగర్ చేరుకుని విచారణను ఎదుర్కొంటారా? లేక కోర్టు ద్వారా ఉపశమనం పొంది మరోసారి సిట్‌కు షాక్ ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్ష్యాలు దొరికాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో, కేసీఆర్ విచారణ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు కానుంది.






