Budget 2026: ఆదాయపు పన్ను మినహాయింపు నుంచి పీఎం కిసాన్ వరకు.. సామాన్యులపై వరాల జల్లు!
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, పీఎం కిసాన్ నిధుల హెచ్చింపు వంటి ఐదు కీలక అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూల నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ విప్లవాత్మక మార్పుల పూర్తి వివరాలు ఇవే..
సామాన్యులకు ఊరటనిచ్చే 5 ప్రధాన ప్రకటనలు:
1. ఆదాయపు పన్ను (Income Tax) – ఊరటనిచ్చే కొత్త పరిమితులు: మధ్యతరగతి ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 13 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 1 లక్షకు పెంచవచ్చని సమాచారం. ఈ మార్పులు అమలైతే, ఏడాదికి రూ. 13 లక్షల వరకు సంపాదన ఉన్నవారికి పన్ను భారం ఉండదు.
2. పీఎం కిసాన్ సాయం (PM-Kisan) – 50 శాతం పెంపు: అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏడాదికి రూ. 6,000 నుండి రూ. 9,000 వరకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల రైతులకు ప్రతి విడతలో రూ. 2,000 బదులుగా రూ. 3,000 నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి.
3. రైల్వే రంగం – 300 కొత్త రైళ్లు: ప్రయాణికుల సౌకర్యార్థం, ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ సమస్యను తగ్గించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 300 కొత్త వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. 2030 నాటికి రైల్వే ప్రయాణాల్లో వెయిటింగ్ లిస్ట్ అనేదే లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రైల్వే బడ్జెట్ కేటాయింపులను గత ఏడాది కంటే పెంచనున్నారు.
4. సోలార్ విద్యుత్ – సబ్సిడీ పెంపు: ‘పీఎం సూర్య ఘర్ యోజన’ కింద ఇచ్చే సోలార్ ప్యానెల్ సబ్సిడీని కిలోవాట్‌కు రూ. 30,000 నుండి రూ. 40,000కి పెంచే డిమాండ్ ఉంది. 2027 నాటికి కోటి ఇళ్లపై సౌర విద్యుత్ పలకలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం, ఈ నిర్ణయం ద్వారా సామాన్యుల కరెంటు బిల్లును సున్నా చేయాలని చూస్తోంది.
5. ఆయుష్మాన్ భారత్ (PM-JAY) – వయసు పరిమితి తగ్గింపు: ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు దాటిన వారికి ఉన్న ఉచిత చికిత్స సౌకర్యాన్ని 60 ఏళ్లకు తగ్గించే అవకాశం ఉంది. దేశంలో 60 ఏళ్లు నిండిన వారిలో 82 శాతం మందికి బీమా లేకపోవడంతో, వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా నిబంధనలు మార్చనున్నారు. అలాగే క్యాన్సర్, గుండె శస్త్ర చికిత్స వంటి ఖరీదైన వైద్యం కూడా ఇందులో కవర్ చేసేలా మార్పులు ఉండవచ్చు.






