Aditya Birla: హైదరాబాద్‌లో తగ్గుతున్న ఆర్థిక అనిశ్చితి.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులపై ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన అ-నిశ్చిత్ సూచీ 2.0 అధ్యయనంలో హైదరాబాద్ ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. జాతీయ సగటు అనిశ్చితి సూచీ 79గా ఉండగా, హైదరాబాద్‌లో ఇది 76గా నమోదైంది. అంటే జాతీయ స్థాయి కంటే హైదరాబాద్ ప్రజలు మెరుగైన ఆర్థిక సన్నద్ధతతో తక్కువ అనిశ్చితిని ప్రదర్శిస్తున్నారు. అయితే దక్షిణాది జోన్ సగటు (71)తో పోలిస్తే నగరంలో కొంత ఆందోళన ఎక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
డిజిటల్ భద్రతకే అగ్రతాంబూలం..
హైదరాబాద్ వాసులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో డిజిటల్ భద్రత మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా..
- వ్యక్తిగత డేటా చోరీకి గురవ్వడం.
- ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల్లో భద్రత లేకపోవడం.
- పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్‌లు.
వీటితో పాటు నగరంలో పెరుగుతున్న నేరాల సంఖ్య, కాలుష్యం, జీవన వ్యయాల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు విస్తరించగలవా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బీమాతో తగ్గుతున్న భయం
ఆర్థిక భద్రతకు, ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక హైలైట్ చేసింది. ఒకటి లేదా రెండు బీమా పాలసీలు ఉన్నవారిలో అనిశ్చితి 77గా ఉండగా, నాలుగు అంతకంటే ఎక్కువ పాలసీలు ఉన్నవారిలో ఇది 64కి పడిపోయింది. అంటే సరైన బీమా రక్షణ ఉన్నవారిలో భవిష్యత్తు పట్ల ధీమా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది.
సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు
నివేదిక ప్రకారం ఎగువ ఆదాయ వర్గాల్లో (SEC A) అనిశ్చితి స్థాయి 64గా ఉండగా, మధ్య మరియు దిగువ ఆదాయ వర్గాల్లో (SEC B & C) ఇది 82 నుండి 83 వరకు అధికంగా ఉంది. అలాగే పురుషుల కంటే మహిళల్లో, యువత కంటే పెద్దవారిలో (బేబీ బూమర్స్ మరియు జెన్ ఎక్స్) అనిశ్చితి ఎక్కువగా కనిపిస్తోంది. వివాహం అయ్యి పిల్లలు ఉన్నవారు భవిష్యత్తు బాధ్యతల పట్ల కొంత ఎక్కువ ఆందోళనతో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ వాసులు ఆర్థిక ప్రణాళికల పట్ల అవగాహన కలిగి ఉన్నప్పటికీ, డిజిటల్ రిస్కులు, మారుతున్న సామాజిక పరిస్థితులు వారిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక, తగినంత బీమా రక్షణ కలిగి ఉండటం ద్వారా ఈ అనిశ్చితిని అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని ఈ నివేదిక సూచిస్తోంది.






